Telangana | ఢిల్లీ, జూలై 16 (నమస్తే తెలంగాణ): పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విచారణ సంఘం సారథిగా ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డ్డి, విచారణ సంఘం బాధ్యతల నుంచి వైదొలిగారు.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే ఆయన రాజీనామాను సమర్పించారు. ఈ మేరకు మంగళవారం అనూహ్య, నాటకీయ పరిణామాలు సంభవించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిపిన విద్యుత్తు కొనుగోళ్లు- కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో గత మార్చి 14న ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
నాటి వ్యవహారాలపై వివరణ ఇచ్చేందుకు తన ముందు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే, విచారణ ప్రక్రియ పూర్తి కాకుండానే జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, తప్పు జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడడం సరికాదని, న్యాయ ప్రాధికార సంస్థ అయిన విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన నిర్ణయాల మీద ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించడం చెల్లదని వాదిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇరు పక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరగ్గా, రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. కేసీఆర్ న్యాయ పోరాటం ఫలితంగా జస్టిస్ నర్సింహారెడ్డ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జస్టిస్ నర్సింహారెడ్డ్డి తన పరిధిని దాటి వ్యవహరించారని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణను సమగ్రంగా పూర్తి చేయకుండానే, కేసీఆర్ విచారణకు హాజరుకాకుండానే, విద్యుత్తు వ్యవహారాలపై జస్టిస్ నర్సింహారెడ్డ్డి మీడియాతో మాట్లాడిన తీరుపై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘న్యాయం జరగటమే కాదు; జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. ఆయన (జస్టిస్ నర్సింహారెడ్డి) ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. విచారణాంశం మంచి చెడ్డల గురించే ఆయన మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతున్నది. ఇది సరికాదు.
ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఒక జడ్జి అయి ఉండీ ఆయన ఇట్లా చేయడం తగదు’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘కమిషన్ విధివిధానాలు పాటించారా? లేదా? లాంటి చిన్నవిషయాలైతే మేం వదిలేసేవాళ్లం. కానీ ఆయన విచారణాంశం మెరిట్స్‌లోకి వెళ్లారు. అందువల్ల మేం మీకొక అవకాశం ఇస్తున్నాం. విచారణ సంఘానికి మరొకరిని నియమించండి’ అని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఏకసభ్య కమిషన్ బాధ్యుడిగా మరొకరిని నియమించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. జస్టిస్ నర్సింహారెడ్డ్డి ఆ పదవిలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు మౌఖికంగా నిరాకరించింది. జస్టిస్ నర్సింహారెడ్డ్డిని తొలగించి, అదే నోటిఫికేషన్ కింద మరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా అప్పుడు భోజన విరామ సమయం కావటంతో విచారణను వాయిదా వేసింది.
భోజన విరామ అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి విచారణ ప్రారంభం కాగానే, కమిషన్ తరఫున, జస్టిస్ నర్సింహారెడ్డ్డి తరఫున న్యాయవాదులు (గోపాల్ శంకర్నారాయణన్) కల్పించుకుని, జస్టిస్ నర్సింహారెడ్డే కమిషన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంటున్నట్టు చెప్పారు. మరొకరిని నియమించేందుకు ఆయన సహకరించనున్నారని వెల్లడించారు. కమిషన్ పదవి నుంచి వైదొలగుతున్నట్టుగా జస్టిస్ నర్సింహారెడ్డి రాసిన ఒక లేఖను కూడా వారు ధర్మాసనానికి అందజేశారు.
ఈ సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది కల్పించుకుని, కొత్తగా ఎవరితో ఏకసభ్య కమిషన్ నియమించేదీ తెలియజేసేందుకు సోమవారం (ఈ నెల 22వ తేదీ) వరకు సమయం కావాలని కోరారు. కమిషన్ ఇప్పటిదాకా పూర్తిచేసిన దశ నుంచే కొత్త కమిషన్ తదుపరి విచారణ జరిపేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని కోరారు.
దీనిపై పిటిషనర్ కేసీఆర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహద్గీ కల్పించుకుని, కమిషన్ విచారణే ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందని చెప్తున్నప్పుడు, అదే విచారణను కొనసాగించాలని ప్రభుత్వం కోరటంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావటం లేదని అన్నారు. ‘అసలు ఈ మొత్తం విచారణే రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాజీ సీఎం మీద కేసులు పెడుతున్నారు. నిజ నిర్ధారణ సంఘం పేరుతో రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయలేరు’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ కేసులోని మెరిట్స్ (పూర్వాపరాలు, మంచిచెడ్డల) గురించి కమిషన్‌కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే. కానీ ఆయన కేసు మెరిట్స్‌లోకి వెళ్లారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏర్పాటయ్యే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చే ఆదేశాలేమీ శిరోధార్యం కావు (నాట్ బైండింగ్). కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి (పిటిషనర్) ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉన్నది’ అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ స్పందిస్తూ, ఈ కమిషన్ విచారణ ఆధారంగా సివిల్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండదని, అలా జరపలేమని వ్యాఖ్యానించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 ప్రకారం ఏర్పాటయ్యే విచారణ సంఘం చేసేది నిజ నిర్ధారణ మాత్రమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. జస్టిస్ నర్సింహారెడ్డ్డి కమిషన్ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ పిటిషనర్ దాఖలు చేసిన ఎస్ఎల్పీ పరిష్కారమైనట్టు ప్రకటించింది. దీంతో కేసీఆర్ చేసిన న్యాయపోరాటం కీలక మలుపు తిరిగినట్టయ్యింది.
Supreme Court
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాలపై కేసీఆర్ సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిమిత్తం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డ్డిని ఏకసభ్య కమిషన్‌గా నియమించింది. ఈ క్రమంలో కేసీఆర్ తమ ఎదుట హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యే గడువు ముగియకముందే జస్టిస్ నర్సింహారెడ్డ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో ధర అధికంగా ఉన్నదని, విద్యుత్తును ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేయటం వల్ల నష్టం జరిగిందని, విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లలో వినియోగించేందుకు ఎంచుకున్న సాంకేతికత వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమని, భద్రాద్రి ప్లాంట్‌కు రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టడం వల్ల కూడా రూ.కోట్ల నష్టం చేకూరుతుందని.. తదితర విషయాలను మీడియాతో చెప్పడాన్ని ఆక్షేపిస్తూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిజనిర్ధారణ కమిషన్ అప్పటి వరకు జరిగిన విచారణ విషయాలను మాత్రమే జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారని చెప్పి పిటిషన్‌ను హైకోర్టు ఈ నెల 1న కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. విద్యుత్తు విచారణ కమిషన్ నియామకం ఉత్తర్వులు చెల్లవని వాదించారు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్1952 ప్రకారం ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తున్నట్టు పేర్కొనటం చట్టవ్యతిరేకమని అన్నారు.
రెండు రాష్ర్టాల మధ్య విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు జరిగితే ఒక రాష్ట్రం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చెల్లదని తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య వివాదం ఏర్పడితే రాజ్యాంగ ధర్మాసనాలు విచారణ చేయాలి గానీ కమిషన్ కాదని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్తెలంగాణ రాష్ర్టాలకు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్లు ఉన్నాయని, ఏవైనా అభ్యంతరాలను ఆయా ట్రిబ్యునల్స్ వద్ద తేల్చుకోవాలని, ట్రిబ్యునల్ ఇచ్చే ఉత్తర్వులతో సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టులో సవాల్ చేసుకోవాలని చట్టంలోని నిబంధనలు చెప్తుంటే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం ఏకపక్షంగా న్యాయ కమిషన్‌ను ఎలా వేస్తుందని ప్రశ్నించారు.
తెలంగాణ ఆవిర్భావ సమయంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తకుండా 2014లో నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ రంగాలు పురోగమన దిశగా పయనిస్తున్న అంశాలను కూడా గమనంలోకి తీసుకోవాలని వివరించారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సమయంలో విద్యుత్తు సంక్షోభం ఉన్నందున విద్యుత్తు కొనుగోళ్లు చేసినట్టు చెప్పారు. ఇలాంటి ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో టెండర్ల విధానానికి బదులు నామినేషన్ పద్ధతిని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అధికారం చట్టంలో ఉన్నదని వెల్లడించారు.
నామినేషన్ విధానం కూడా మరో రాష్ట్ర ప్రభుత్వంతోనే అన్న కీలక విషయాన్ని విస్మరించకూడదని గుర్తుచేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించినట్టు వివరించారు. ప్రతిష్ఠాత్మక బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే భద్రాద్రి థర్మల్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించాలనే నిర్ణయంలో అక్రమాలకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోళ్లు చేసిన ధరలను పరిశీలిస్తే, మార్కెట్ రేట్ కంటే తక్కువగా యూనిట్ రూ.3.90కే కొనుగోలుకు ఒప్పందం జరిగినట్టు వివరించారు.
కేసీఆర్ సీఎంగా ఉండగా, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి విద్యుత్తు వ్యవహారాలపై ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత వాటిపై ముందుకు వెళ్లలేదని, ఇప్పుడు కక్షసాధింపుతో కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. తప్పు జరిగిపోయిందనే నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం ముందుగానే వచ్చేసి జస్టిస్ నర్సింహారెడ్డ్డి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తప్పుపట్టారు.
జస్టిస్ నర్సింహారెడ్డ్డి కూడా విచారణ పూర్తికాకుండా అరకొర అసంపూర్తి విచారణ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వచ్చిందంటూ మీడియా ముందు వెల్లడించారని చెప్పారు. వాస్తవానికి అప్పటికి కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకాలేదని, కమిషన్ నిర్దేశించిన తేదీకి మరో నాలుగైదు రోజుల సమయం ఉండగానే జస్టిస్ నర్సింహారెడ్డ్డి ఆ విధంగా చెప్పడం ద్వారా నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని స్పష్టం అవుతున్నదని రోహద్గీ వివరించారు.
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా జస్టిస్ నర్సింహారెడ్డ్డి వ్యవహారశైలి ఉన్నదని వాదించారు. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లో జ్యుడీషియల్ కమిషన్‌గా పేర్కొనటం దగ్గర నుంచి ప్రభుత్వ తీరు, ఈఆర్సీ ఉండగా కమిషన్ విచారణ చేయరాదన్న నిబంధనలు, కమిషన్ వైఖరి, జస్టిస్ నర్సింహారెడ్డ్డి మీడియాకు వెల్లడించిన విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని విన్నవించారు.
‘కమిషన్ తన పరిధిని దాటింది. ముందే ఒక నిర్ణయానికి వచ్చింది. జ్యుడీషియల్ ఎంక్వైరీ చేస్తుందని విద్యుత్తు శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నది. జ్యుడీషియల్ ఎంక్వైరీకి, ఎంక్వైరీ కమిషన్‌కు చాలా తేడా ఉన్నది. ఒక రాష్ట్ర నిజనిర్ధారణ కమిషన్ రెండు రాష్ర్టాల మధ్య జరిగిన విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ ఎలా చేస్తుంది? ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ ఒప్పందం చేసుకుంటే ఈఆర్సీల్లో తేల్చుకోవాలి. ట్రిబ్యునల్‌తో విభేదిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. కమిషన్ విచారణ చేయటం చెల్లదు. ప్రస్తుత సీఎం కక్షసాధింపునకు పాల్పడుతున్నారు.
విద్యుత్తు కమిషన్ ఏర్పాటు చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపే. ప్రభుత్వం మారగానే పాత సీఎంపై కక్షసాధింపుతో విద్యుత్తు వ్యవహారంపై విచారణకు కమిషన్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే ప్రస్తుత సీఎం ఆర్టీఏ ద్వారా అనేక వివరాలు సేకరించారు. అధికారంలోకి వచ్చాక కక్షసాధింపు చర్యల్లో భాగంగా వాటిని వినియోగించుకుంటున్నారు. ఆ వివరాల ఆధారంగానే ముందస్తు కుట్రతో కమిషన్ వేశారు.
జస్టిస్ నర్సింహారెడ్డ్డి పిటిషనర్‌ను జున్ 15న కమిషన్ విచారణకు రావాలని నోటీసు ఇచ్చి, జూన్ 11నే మీడియా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించటం ఎంతవరకు సమర్థనీయం?’ అని న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగానే, సీజేఐ కల్పించుకుని, మీడియాతో జస్టిస్ నర్సింహారెడ్డ్డి మాట్లాడిన విషయాలపై తాము తేల్చుతామని అన్నారు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ సెక్షన్-3 ప్రకారం ప్రజావసరాల నిమిత్తమే కమిషన్ విచారణకు ప్రభుత్వాలు ఆదేశించాలని రోహత్గీ చెప్పారు.
విద్యుత్తు కొనుగోలు వ్యవహారంలో ప్రజావసరాలు ఏమున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్తును కొనుగోలు చేసిన విషయం మర్చిపోరాదని అన్నారు. ఇది ప్రజావసరమైన విషయం కాదంటారా? అని సీజేఐ ప్రశ్నించగా, కాదని రోహత్గీ జవాబు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో విద్యుత్తు కొరత తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పీపీఏ చేసుకున్నదని వివరించారు.
థర్మల్ పవర్ సింగరేణి నుంచి రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని జస్టిస్ నర్సింహారెడ్డ్డి మీడియాకు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని అన్నారు. విద్యుత్తు కొనుగోళ్లు తక్కువ ధరకే జరిగినట్టు చార్టు చూస్తే అర్థం అవుతుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి యూనిట్ ధర రూ.3.91కు కొనుగోలు చేస్తే సొంత తెలంగాణ పవర్ కార్పొరేషన్ వద్ద రూ.4.65 ధర ఉందన్నారు. విద్యుత్తు టారిఫ్ గురించి కూడా జస్టిస్ నర్సింహారెడ్డ్డి మీడియాకు చెప్పారని వివరించారు.
ఈ వ్యవహారంలో కమిషన్ జోక్యానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ వ్యవహారంపై చర్యలు ఉంటే అది తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ ఎంవోయూ చేసుకుంటే అధికారుల పాత్ర లేదని జస్టిస్ నర్సింహారెడ్డ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. రెండు రాష్ర్టాల మధ్య ఎంవోయూ చేసుకుంటే సంబంధం లేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
అధికారులతో మాట్లాడానని జస్టిస్ నర్సింహారెడ్డ్డి చెప్పారని అన్నారు. భద్రాద్రి ప్లాంట్ సబ్ క్రిటికల్ విషయం గురించి చెప్తూ రైల్వే లైన్ పనుల పూర్తిపై తనకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని చెప్పడం పరాకాష్టగా అభివర్ణించారు. నిజనిర్ధారణ మాత్రమే చేయాల్సిన కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డ్డికి వ్యక్తిగత సందేహాలు ఉంటే వాటిని మీడియాకు ఎలా చెప్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా అదనపు బొగ్గు కావాలని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమని, సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వినియోగించకపోవటం తప్పిదమని కూడా చెప్పారని వివరించారు.
ఈ వాదనల తర్వాత ధర్మాసనం పలు సందేహాలను కమిషన్ ముందుంచింది. కమిషన్ అలాంటి విషయాలను ఎలా చెప్తుందని ప్రశ్నించింది. రెండు రాష్ర్టాల విద్యుత్తు సంస్థల మధ్య ఎంవోయూ జరిగిందని, అధికారుల పాత్ర లేదని కమిషన్ ఎలా చెప్తుందని నిలదీసింది. కమిషన్ సేకరించిన వివరాలపై వివరణ మాత్రమే ఇచ్చారన్న జవాబుతో కోర్టు సంతృప్తి చెందలేదు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరగలేదని, ఇంకా నిర్మాణంలో ఉన్నప్పుడు నష్టం వస్తుందని ముందుగానే ఊహించి ఎలా చెప్తారని ప్రశ్నించింది. పనులు పూర్తి కాలేదని, ఆర్థిక భారం పడుతుందని కూడా జస్టిస్ నర్సింహారెడ్డి ఎలా వెల్లడిస్తారని నిలదీసింది.
ఏం జరిగిందో విచారణ చేసి నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్ ఆ వివరాల్లోకి వెళ్లడం తన పరిధిని దాటడం కాదా? రైల్వే లైన్ నిర్మాణం పూర్తిపై తనకు వ్యక్తిగత అనుమానాలు ఉన్నాయని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పడం మరీ విస్మయం కలిగిస్తున్నదని వ్యాఖ్యానించింది. కమిషన్ తన వద్ద ఉన్న వివరాలు వెల్లడించటమే కాకుండా తన పరిధిలోకి రాని విషయాలపై, వ్యక్తిగత అభిప్రాయాలపై మాట్లాడటం తీవ్ర విషయం కాదా? అని ప్రశ్నించింది.
ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చి మీడియాకు చెప్పటమేమిటని అడిగింది. వివరణ ఇచ్చే క్రమంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారని కమిషన్ న్యాయవాది సింఘ్వీ జవాబు చెప్పగా, అది కమిషన్ తన పరిధి దాటడం కాదా? అని నిలదీసింది. న్యాయమూర్తులు (ఈవీన్ కమిషన్) విచారణ చేపట్టేప్పుడు నిజాయితీగా ఉండటమే కాదని, నిజాయితీగా కనబడాలని అభిప్రాయపడింది. ‘కమిషన్ నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డిని మార్పు చేయడమే ఉత్తమం.
మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోర్టు స్పష్టం చేసింది. ‘జ్యుడీషియల్ విచారణా? ఎంక్వైరీ కమిషన్ విచారణా? ఈ రెండింటికీ తేడా ఉన్నదనే దానిపై మేము వివరణ ఇస్తాం. చివరికి ఏదైనా ఒక్కటే కదా? సెక్షన్ 3 ప్రకారం ఒక్కటే కదా? నిజనిర్ధారణ మాత్రమే జరిగేది కదా! కమిషన్ తన విశ్వసనీయతను కూడా చూపాలి. అయితే, ఇక్కడ కమిషన్ తన పరిధిని దాటి మీడియాతో మాట్లాడింది’ అని బెంచ్ పేర్కొన్నది.
ఈ దశలో పిటిషనర్ న్యాయవాది రోహత్గీ కల్పించుకుని, రెప్యుటేషన్కు సంబంధించిన వ్యవహారమని, తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కమిషన్‌కు కళ్లెం వేయాలని కోరారు. రామకృష్ణ దాల్మియాకరుణానిధి కేసులో కమిషన్ హైకోర్టు ఉత్తర్వుల గురించి మాత్రమే చెప్పిందని, ఆ తీర్పు ఈ కేసుకు వర్తించదని చెప్పారు. ఇక్కడ కమిషన్ తన ముందున్న విచారణ చేయాల్సిన వ్యవహారంలోని మంచిచెడులపై మాట్లాడారని వివరించారు. కమిషన్ ఏకపక్షంగా ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.
తిరిగి 2 గంటలకు జరిగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు.. మరొకరిని కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, జస్టిస్ నర్సింహారెడ్డిని మార్పు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. కొత్త వ్యక్తిని ఎవరిని నియమించేదీ సోమవారం (22న) తెలియజేస్తామని చెప్పారు.
ఇదే సమయంలో కమిషన్ పదవి నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకుంటున్నట్టు కమిషన్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ దశ నుంచే కొత్తగా నియమితులయ్యే జడ్జి విచారణ కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో ‘జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా తన పరిధిని దాటారు.
మీడియా సమావేశంలో వెల్లడించిన విషయాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. న్యాయమూర్తి అయినా, కమిషన్ విచారణ చేసే రిటైర్డ్ న్యాయమూర్తి అయినా నిజాయితీగా ఉండటమే కాదు.. నిజాయితీగా కనిపించాలి. కమిషన్‌కు చైర్మన్ స్థానంలో ఉండి నిజనిర్ధారణ నివేదిక ఇవ్వాల్సిన వ్యక్తి.. ప్రెస్మీట్లో అభిప్రాయాలు చెప్పడం సబబు కాదు. కమిషన్ అనుసరించిన విధివిధానాలను వెల్లడించడం సరికాదు. విచారణ నివేదిక అనేది ఒక వ్యక్తి ప్రతిష్ఠను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. విచారణలో న్యాయబద్ధత పాటించాల్సిన అవసరం ఉంటుంది.
జస్టిస్ నర్సింహారెడ్డి వ్యవహరించిన తీరులో అదేమీ కనపించటం లేదు. ఈ పరిస్థితుల్లో ఏకసభ్య కమిషన్‌గా ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చాలి. కమిషన్ చైర్మన్ స్థానంలో మరొకరిని నియమించాలి’ అని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే మీడియాతో చెప్పారని న్యాయవాది సింఘ్వీ చెప్తున్నారని, విచారణ చివరి దశకు చేరిందని కూడా చెప్తున్నందున.. విచారణ దశ నుంచే కొత్తగా నియమితులయ్యే కమిషన్ చైర్మన్ విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. కొత్త వ్యక్తి నియామక అధికారాన్ని తెలంగాణ రాష్ర్టానికే ఇస్తున్నట్టు పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు మనుసింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదించారు. నిజనిర్ధారణ మాత్రమే చేసే కమిషన్ విచారణను అడ్డుకునేందుకు పిటిషనర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారని అన్నారు. తొలిసారి నోటీసు జారీ చేస్తే, పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా కోరారని, ఆ తర్వాత కూడా మళ్లీ గడువు కోరారని, ఇప్పుడు మీడియాకు జస్టిస్ నర్సింహారెడ్డ్డి ఏదేదో చెప్పారంటూ న్యాయపోరాటం ద్వారా కమిషన్‌ను అడ్డుకోవాలనుకుంటున్న కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని కోర్టును కోరారు. కమిషన్ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం ఆమోదం తర్వాత పిటిషనర్ న్యాయపోరాటం చేసేందుకు అవకాశం ఉంటుందని, వాస్తవాలు ఏమిటో తేలకుండానే కమిషన్ విచారణ చేయడానికి వీల్లేదనే వాదన చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, కమిషన్ తీరును ధర్మాసనం పలుసార్లు ప్రశ్నించింది.
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్:
న్యాయం జరగడమే కాదు; జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. ఆయన (జస్టిస్ నర్సింహారెడ్డి) ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విచారణాంశం మంచి చెడ్డల గురించే ఆయన మాట్లా డారన్న అభిప్రాయం కలుగుతున్నది. ఇది సరికాదు. ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఒక జడ్జి అయి ఉండీ ఆయన ఇట్లా చేయడం తగదు.
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్:
ఒకవేళ కేసులోని మెరిట్స్ (పూర్వాపరాలు, మంచిచెడ్డల) గురించి కమిషన్‌కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే. కానీ ఆయన కేసు మెరిట్స్‌లోకి వెళ్లారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ కింద ఏర్పాటయ్యే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చే ఆదేశాలేమీ శిరోధార్యం కావు (నాట్ బైండింగ్). కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి (పిటిషనర్) ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ:
ఈ కమిషన్ విచారణ ఆధారంగా ఎవరిపైనా సివిల్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండదు. అలా జరపలేం.