Supreme Court | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చిచెప్పింది. ఇప్పటికే పలుమార్లు తగిన సమయం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఈపాటికే స్పీకర్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తగిన నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. నాలుగు వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను స్పీకర్ పూర్తిచేయాలని ఆదేశించింది. కానీ రెండు వారాల్లో స్పీకర్ తీసుకునే చర్యల ప్రగతిని వివరించాలని ఆదేశించింది. రెండు వారాల నాటికి ఉన్న పురోగతి ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. రెండు వారాల్లోగా స్పష్టమైన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, గడువు దాటిన తరువాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తమకు తెలుసునని న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
ఎనిమిది వారాల గడువు కావాలి
బీఆర్ఎస్ పార్టీ చిహ్నంపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. తొలుత స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేల అనర్హతను తేల్చేందుకు స్పీకర్‌కు మరో ఎనిమిది వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో కనీసం నాలుగు వారాలైనా గడువు ఇవ్వాలని కోరారు. శాసనసభ కార్యదర్శి బదిలీ కావడం, అసెంబ్లీ సమావేశాలు జరగడం వంటి కారణాల వల్ల స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కుదరలేదని వివరించారు. స్పీకర్ కంటి ఆపరేషన్ కోసం రెండు రోజులు వెళ్లారని తెలిపారు. వీరి అభ్యర్థనపై కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, న్యాయవాది మోహిత్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు గతంలో ఇచ్చిన ఎనిమిది వారాల గడువు ఇప్పటికే ముగిసిందని గుర్తుచేశారు.
నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు మరోసారి గడువు కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఒక ఎమ్మెల్యే అదే పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారని, ఇప్పటికీ పిరాయింపు ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గురించి చెప్పారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆమె తరఫున ఎన్నికల ప్రచారం చేశారని తెలిపారు. ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేగానే ఉన్నప్పటికీ స్పీకర్ కనీసం విచారణ చేపట్టలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ గానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ మళ్లీ గడువు కోరడాన్ని ఆమోదించవద్దని కోరారు. ఫిరాయింపులకు పాల్పడినట్లుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ చర్యలు లేవంటే కావాలనే జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నదని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువే చాలా ఎకువ కాలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులను పాటించకుండా మరోసారి గడువు అడగడాన్ని తప్పుపట్టారు.
ఏడుగురిపై తీర్పు వెలువడింది
ఈ వాదనలపై అభిషేక్ మనుసింఘ్వీ స్పందిస్తూ.. ఇప్పటికే ఎనిమిది మందిపై వచ్చిన ఫిరాయింపుల అభియోగాలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏడుగురు ఎమ్మెల్యేలపై తీర్పును వెలువరించారని, మరో ఎమ్మెల్యే వ్యవహారంపై తీర్పును రిజర్వు చేశారని వివరించారు. ప్రస్తుతం స్పీకర్ ముందు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు విచారణలో ఉన్నాయని తెలిపారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డ్కవర్లో ధర్మాసనానికి అందజేశారు. ఈ దశలో ధర్మాసనం రెండు వారాల గడువు మాత్రమే ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయబోగా, సింఘ్వీ కల్పించుకుని కనీసం నాలుగు వారాల గడువు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రెండు వారాల్లో జరిగిన పురోగతిని పరిశీలించి ఆ తర్వాత తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. స్పీకర్‌కు నాలుగు వారాలు గడువు ఇస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.