హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహనరావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో మోహనరావు గుంటూరులో తహసీల్దారుగా ఉన్నప్పుడు ఇండ్ల కూల్చివేతను ఆపాలని ఓ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆయన ఆ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించకపోవడంతో 2 నెలల జైలుశిక్ష విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ మోహనరావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఆ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరేమైనా హైకోర్టు కంటే పెద్దవాడినని, చట్టానికి అతీతుడినని అనుకుంటున్నారా? హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన మిమ్మల్ని ఎలా క్షమించాలి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారి అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. అమరావతి, విజయవాడ, తీహార్లలో ఏ జైలుకు వెళ్లాలో నిర్ణయించుకోవాలని మోహనరావుకు స్పష్టం చేశారు. మోహనరావుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పడంతో.. ‘పిటిషనర్ ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు. వారి పిల్లలు ఏమవుతారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న మోహనరావును డిమోట్ చేసి తహసీల్దార్‌గా నియమించాలని తీర్పు ఇచ్చారు.