హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై తమ వైఖరిని తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, అలా కాకుండా ‘శస్త్ర చికిత్స విజయవంతం.. కానీ రోగి మృతి’ అన్నట్టుగా జరగకూడదని వ్యాఖ్యానించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడువు ముగిసేంత వరకూ నిర్ణయం తీసుకోకుండా ఉండరాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు, స్పీకర్ కార్యాలయానికి, అసెంబ్లీ కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీచేసింది. అలాగే కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణలోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ‘ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. (ఫిరాయింపుదార్ల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి) సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలా? అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువ ఏమిటి?. ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్ర మే ఎదురుచూడరు. ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం కలిగిస్తుందన్నదానిపై ఆసక్తి కలిగి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నమోదైన పిటిషన్లపై తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా, సముచిత సమయం లో (రీజనబుల్ టైం) తీసుకోవాలని మరోసారి తేల్చి చెప్పింది. రీజనబుల్ టైం అంటే ఎంతో తేల్చకుండా కాలయాపన వైఖరితో పుణ్యకాలం (అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి) ముగిసే వరకు ఉండాలా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ హైకోర్టు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ కార్యాలయం రీజనబుల్ టైంలో తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని గుర్తుచేసింది. ఫిరాయింపుదార్లపై తేల్చకపోతే వాళ్లు చట్టసభ సభ్యులుగా కొనసాగుతూనే ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంతో ముడిపడిన రాజ్యాంగపరమైన ఈ వివాదాన్ని కొలికి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
‘ఈ కేసు ఈ ఏడాది జనవరి 31న విచారణకు వచ్చినప్పుడు, మేము ఫిబ్రవరి 10కి వాయిదా వేశాం. ఆ సమయంలో సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, శేఖర్ నాఫ్ డే తమ వాదనలు వినిపించారు. అప్పుడు ధర్మాసనం.. స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పగలరా? తద్వారా మేము ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండవచ్చు అని నాడు రోహత్గీని ప్రశ్నించి, తదుపరి విచారణ ను ఫిబ్రవరి 20కి వాయిదా వేశాం. ఆ తదుపరి విచారణ సమయంలో రోహత్గీ మాట్లాడుతూ, స్పీకర్ పక్షాన తాము ఎటువంటి ప్రకటన చేయలేమని అసెంబ్లీ కార్యదర్శి సమాచారమిచ్చినట్టు పేర్కొన్నారు. ఈ రోజు మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు (న్యాయవాదు లు) డాక్టర్ సింఘ్వీ, రోహత్గీ అభ్యంతరం లేవనెత్తారు. ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా (ఫార్మల్) నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయాం అన్నారు. వారి అభ్యంతరం సాంకేతికపరమైనది అనడంలో సందేహం లేదు. సహజ న్యాయసూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తరువాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీచేస్తాం’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ కేసులలోని ప్రతివాదులలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పీకర్‌కు కూడా నోటీసు జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. తాము స్పీకర్ తరఫున వాదించడంలేదని, స్పీకర్ కార్యదర్శి తరఫున వాదిస్తున్నట్లు ఇద్దరు సీనియర్ న్యాయవాదులు చెప్పడంతో మూడు పద్ధతుల ద్వారా నోటీసులను జారీచేసింది. ఒకటి సుప్రీంకోర్టు నేరుగా నోటీసులు జారీచేసింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ద్వారా స్పీకర్‌కు నోటీసులు అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్లు స్వయంగా నోటీసులను స్పీకర్‌కు అందజేసేందుకు కూడాఅనుమతిచ్చింది. ఈ సమయంలో రాష్ట్రం తరఫు వా దించే న్యాయవాది ఎవరని కోర్టు ప్రశ్నించిం ది. ఎవరూ స్పందించకపోవడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసు లు ఇస్తామని హెచ్చరించింది. స్పీకర్, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసుల ఉత్తర్వు ప్రతి అధికారికంగా అందాల్సి ఉన్నది.
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో రెం డు పిటిషన్లు దాఖలు చేసింది. ఒక పిటిషన్‌ను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేయగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
తొలుత పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేసేలా స్పీకర్‌కు ఉత్తర్వులు ఇ వ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 32, 226 అధికరణాల ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విస్తృతాధికారాల మేరకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్నారు. సుభాష్ దేశాయ్, కేశం మెఘాచంద్, రాజేంద్రసింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్డు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం, సుభాష్ దేశాయ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఆ గడువు ఎంతో నిర్దేశించలేదని గుర్తుచేసింది. తిరిగి సుందరం వాదనలు కొనసాగిస్తూ, రాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్దిష్ట గడువులోనే ఫిరాయింపుల పిటిషన్లను శాసనసభాపతులు పరిషరించాలని జవాబు చెప్పారు. స్పీకర్‌కు ఫిర్యాదు అందిన తర్వాత వాటిని మూడు నెలల్లోగా పరిషరించాలని అన్నారు.
పిటిషనర్లు గత జూలైలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారానికే హైకోర్టుకు వెళ్లారని శాసనసభ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ తప్పుపట్టారు. నారిమన్ కేసులోని మార్గదర్శకాల ప్రకారం ఫిర్యాదుకు-పిటిషన్‌కు మధ్య తగిన గడువు ఉండాలని చె ప్పారు. స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసిందని, ప్రతివాదుల నుంచి సమాధానం రావాల్సి వుందని చెప్పారు. రీజనబుల్ టైం పేరుతో వాయిదాలు వేయరాదని వ్యాఖ్యానించింది. తిరిగి సుందరం కల్పించుకుంటూ పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలనే పిటిషన్లు దాఖలై ఏడాది గడిచిపోయినప్పటికీ ఇంకా ఫలితం లేదని, ఇప్పటికైనా సుప్రీంకోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఫిరాయింపుదారుల్లో ఒకరు (ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్) సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని, మరొకరు (స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి) తన కుమార్తె కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తే ఆమెకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేశారని సుందరం చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని వివరించారు. వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన రాజకీయాలు వాళ్లు చేయవచ్చునని, అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ వేరే పార్టీ అభీష్టానికి అనుగుణంగా రాజకీయాలు చేయడం కుదరదని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారు పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇష్టమొచ్చినట్టుగా రాజకీయాలు చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఒకలా అధికారం లేని చోట మరొకలా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్టుగా ఉండకూడదు. (ఫిరాయింపుదార్ల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి) సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలా? అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువ ఏమిటి?. ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురుచూడరు. ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్నదానిపైనా ఆసక్తి కలిగి ఉంటారు.
ఈ కేసులో ప్రతివాదులకు అధికారికంగా (ఫార్మల్) నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయాం అన్నారు. వారి అభ్యంతరం సాంకేతికపరమైనది అనడంలో సందేహం లేదు. సహజ న్యాయసూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తరువాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీచేస్తాం.