
హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): ‘సమస్య మా ఇంటి ఆడబిడ్డదైనా.. తమ ఇంటి బిడ్డలా భావించి, పాపకు కంటి ఆపరేషన్ చేయించి, వెలుగులు ప్రసాదించిన కేటీఆర్ సార్‌కు కృతజ్ఞతలు’- ఇది నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యావలంటీర్ ఎండీ షబ్బీర్ చేసిన ట్వీట్. షబ్బీర్‌కు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుమెరా ఫాతిమా (11)కు రెండేండ్ల క్రితం డెంగ్యూ వచ్చింది. ఆ తరువాత నుంచి ఆ బాలిక ప్రతిదీ రెండుగా కనిపించే డబుల్ విజన్ సమస్యతో బాధపడుతున్నది. ప్రైవేట్ దవాఖానలో శస్త్రచికిత్స చేయించాలంటే రూ.40 వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం, డబ్బు పెట్టి శస్త్ర చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గత డిసెంబర్ 22న తన బిడ్డ పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. తన ఆఫీసు సిబ్బంది ద్వారా సహాయం అందించారు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి దవాఖానలో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయించారు. దీంతో ఫాతిమాకు మంగళవారం శస్త్ర చికిత్స జరిగింది. కేటీఆర్ చేసిన సహాయం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఆపరేషన్ పూర్తయిందని షబ్బీర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేవలం రూ.12 వేల జీతం పొందుతున్న తాను బిడ్డకు వైద్యం చేయించలేని స్థితిలో ఉంటే మంత్రి కేటీఆర్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.