e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides జనసేవకులకు ధీమా

జనసేవకులకు ధీమా

జనసేవకులకు ధీమా
 • ‘హైరిస్క్‌’ గ్రూపులకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్‌.. ఉచిత టీకాల్లో వారికి ప్రాధాన్యం
 • రాష్ట్రంలో 10 లక్షల మంది గుర్తింపు
 • ఇప్పటికే 4లక్షల మందికి టీకా.. త్వరలోనే మిగిలినవారికి
 • కొవిడ్‌ కట్టడిలో సర్కార్‌ సక్సెస్‌
 • జ్వర సర్వేతో మహమ్మారిపై దెబ్బ
 • మరోవైపు పక్కాగా టీకా ప్రణాళిక
 • నిర్ధారణ, నియంత్రణ, నివారణ..
 • వైరస్‌ కట్టడికి ప్రభుత్వ వ్యూహం
 • క్రమంగా తగ్గుతున్న కేసులు
 • దేశానికే ఆదర్శంగా తెలంగాణ
 • కేంద్రం నిర్ణయాలతో రాష్ర్టాలకు తలనొప్పి
 • వ్యాక్సిన్లు లభించక అనేక ఇబ్బందులు
 • గుదిబండగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు
 • టీకాల్లో కేంద్రానికి 50%, 25% ప్రైవేటుకు
 • అన్ని రాష్ర్టాలకు కలిపి మిగిలింది 25శాతమే
 • తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి
 • వాటిని రాష్ట్రం కొనుగోలు చేయలేని దుస్థితి

హైదరాబాద్‌, జూన్‌ 6 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి విశ్వమానవాళిని అతలాకుతలం చేస్తున్నది. మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఈ అంటువ్యాధి ఊపిరి మెసలకుండా చేసి లక్షలమందిని పొట్టన పెట్టుకొన్నది. అలలు అలలుగా విశ్వాన్ని ఇప్పటికే రెండుసార్లు చుట్టేసిన ఈ గత్తర రోగం.. మూడో వేవ్‌కు సిద్ధమవుతున్నదనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికతతో, మానవీయ దృక్పథంతో తీసుకొన్న నిర్ణయాలు.. అమలుచేసిన వ్యూహాలు కరోనాను తరిమి కొట్టడంలో విజయం సాధించాయి. కరోనా పోరులో ముందుండి యుద్ధం చేస్తున్న సైనికులకు (హైరిస్క్‌ గ్రూపులు) టీకాలు వేయడంలో ప్రాధాన్యమివ్వడం ఒకవైపు.. ఇంటింటి జ్వరసర్వేతో వైర స్‌ వ్యాప్తిని నిరోధించడం మరోవైపు సమాంతరంగా అమలుచేసి శత్రువును నిర్వీర్యం చేయడంలో గెలుపు గడప తొక్కుతున్నది. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం జరిపిన ద్విముఖ వ్యూహ పోరులో తెలంగాణ విజయం సాధించింది. మహా కల్లోలానికి ప్రపంచమే చేతులెత్తేసి కరోనాకు లొంగిపోయింది. కనిపించని శత్రువుతో చీకటిలో యుద్ధం లా మారింది పరిస్థితి. బలమైన శత్రువుతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పడు ధైర్యం మాత్రమే సరిపోదు. అం దుకు తగిన వ్యూహంతో.. శత్రువును నిర్వీర్యం చేసే ఎత్తుగడలను ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. కరో నా అనే కనిపించని శత్రువును నిర్వీర్యం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఇదే పద్ధతిని అవలంబించింది. రూపొందించుకున్న పదునైన వ్యూహాలను చాకచక్యంగా అమలుపరిచింది. వాటి సాయంతో విజయం సాధించడమే కాకుండా పక్క రాష్ర్టాలకు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అమలు పరిచిన వ్యూహాల్లో మొదటిది ‘ఇంటింటి జ్వర సర్వే- ఉచితంగా మందుల కిట్‌’. రెండవది ‘అధిక రిస్కు గ్రూపుల గుర్తింపు- పూర్తి ఉచిత వ్యాక్సినేషన్‌’. ఇవి రెండూ విజయవంతం కావడంతో ఇప్పుడు తెలంగాణ కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడుతున్నది.

రెండు వ్యూహాలు సక్సెస్‌
ఇంటింటి జ్వర సర్వే ద్వారా కరోనా లక్షణాలను ముం దస్తుగానే పసిగట్టి, లక్షణాలున్న వారిని ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంచి, కరోనా ప్రభావం చూపకముందే తగిన మం దులు సమకూర్చి కట్టడి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసిన ఈ వ్యూహాత్మక విధానంతో రెండు మంచి పనులు జరిగి చక్కటి ఫలితాలు వచ్చాయి. హైరిస్క్‌ గ్రూపులను గుర్తించి, వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉన్నది. వ్యాక్సిన్‌ కొరత లేదా కేంద్రం అవలంబిస్తున్న విధానాలు.. ఇలా కారణాలేవైనా నిరుపేదలకు వ్యాక్సిన్‌ తగినంతగా అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించారు. అవసరమున్న వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తూనే.. ప్రజల మధ్య తిరిగే అనివార్య పరిస్థితిలో వున్న హైరిస్క్‌ వర్గాలను మొదటి ప్రాధాన్య క్రమంలో మానవతా దృక్పథంతో ఆదుకోవాలని నిర్ణయించారు. నిరంతరం ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెక్కాడితే కాని డొక్కాడని వర్గాలు వీరు. ఉదరపోషణ కోసమే వారు పనిచేసినా.. వారు చేస్తున్న పని పదిమంది ప్రజలకు సాయపడేది. అనివార్య పరిస్థితుల్లో పనిలోకొచ్చి కరోనా అంటుకునే రిస్కును వీరు తీసుకుంటున్నారు.

ఎవరో ఇస్తారని ఎదురుచూడని రాష్ట్రం
కేంద్రం వైపు ఎదురు చూడకుండా, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి అందిస్తున్నది. దాంతో పాటు కిడ్నీ, డయాలసిస్‌ రోగులు, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక రోగ పీడితులు అందరికీ మానవతా దృక్పథంతో పూర్తి ఉచిత టీకా కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఈ హైరి స్క్‌ గ్రూపులను ఆదుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర జనాభాలో దాదాపు ఒక కోటి మంది 45 ఏండ్లు పైబడిన వారున్నారు. వారికి టీకా వేసేందుకు కేంద్రం జూన్‌ 5 వరకు రాష్ర్టానికి 66,63,350 డోసులను మాత్రమే అందించింది. జూన్‌ 5 వరకు 65,75, 731 డోసులను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చారు. ప్రతిరోజూ లక్షా యాభై వేలకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్నది. కేంద్రం నిబంధనలకు పరిమితం కాకుండా, అందరికీ వ్యాక్సినేషన్‌ అనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 18 నుంచి 45 ఏండ్ల వయస్సు వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూన్‌ 5 నాటికి మొత్తం 23,25,590 డోసులకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు సొంత ఖర్చుతో ఆర్డర్లు ఇచ్చింది. కేంద్రం నిబంధనల కారణంగా టీకా ఉత్పత్తి కంపెనీలు ఇందులో 7,40,590 డోసులు మాత్రమే రాష్ర్టానికి అందించాయి. కేంద్రం విధానాల కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్‌ టెండర్లు పిలిచినా వ్యాక్సిన్‌ కంపెనీలు ఆసక్తి చూపలేదు. దాంతో రాష్ర్టాలు తమ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలనుకున్నా వీలులేని దుస్థితి.

అధికశాతం పూర్తయిన హైరిస్క్‌ గ్రూపుల వ్యాక్సినేషన్‌
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 33,700 మంది రేషన్‌ షాపు డీలర్లు, వర్కర్లకుగాను ఇప్పటివరకు 21,664 మందికి అంటే 64% మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అదేవిధంగా 45,234 మంది ఎల్పీజీ డీలర్లు, పెట్రోల్‌ బంకు వర్కర్లకు గాను 34,633 మంది అంటే 77% మందికి వ్యాక్సిన్లు అందాయి. 5468 మంది ఎఫ్‌సీఐ వర్కర్లు, 18,188 మంది జర్నలిస్టులు, మీడియా ఉద్యోగుల్లో 12,408 (68%) మందికి, 38,201 మంది ఎరువులు, పురుగుల మందులు, విత్తన డీలర్లు, దుకాణదారులు, సిబ్బందికిగాను 33,400 మందికి (87%), 12, 158 మంది ఆర్టీసీ ఉద్యోగులకు, 3002 మంది రైతుబజారు వర్తకులకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,14,232 మం ది కూరగాయలు, పూలు, పండ్లు వర్తకులకు, 46,266 మంది కిరాణాషాపుల వాళ్లకు, 2469 మంది బార్బర్‌ షాపుల వాళ్లకు, 3070 వీధివ్యాపారులకు, 2038 మంది ఐరన్‌ లాండ్రీ షాపుల వాళ్లకు, 3198 చిన్న హోటల్‌ వర్కర్లకు, 2406 ఫిష్‌, చికెన్‌, మాంసం దుకాణదారులకు, 892 మంది మెడికల్‌ షాపు వర్కర్లకు, 19,697 మంది ఆటోడ్రైవర్లకు, స్మశాన వాటికల్లో పనిచేసే 2878 మందికి, 19,896 మంది వాటర్‌ డెలివరీ బాయ్స్‌కు, ఇంకా 75,567 మంది ఇతర హైరిస్కు గ్రూపు వ్యక్తులకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయింది.

వ్యాక్సిన్ల కొనుగోలులో కేంద్రం తాజా మెలిక
వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాలు రాష్ర్టాలకు శాపాలుగా మారాయి. దేశం మొత్తం కొనుగోలు చేసే వ్యాక్సిన్లలో 50శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, 25% వ్యాక్సిన్లు దేశంలోని అన్ని రాష్ర్టాలు కలిపి కొనుగోలు చేయాలని, మిగతా 25% వ్యాక్సిన్లు ప్రైవేటు దవాఖానలు కొనుగోలు చేయాలని నిర్ణయిస్తూ.. వ్యాక్సిన్‌ కొనుగోలుపై తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో తయారయ్యే వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మన ప్రజలకు అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విధంగా కేంద్ర నిబంధనలు రాష్ర్టాల ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి.

కేసీఆర్‌ మానవీయ ఆలోచన
వ్యాక్సిన్‌ అవసరమున్న వారందరికీ కేంద్రం నిబంధనల కారణంగా ఒకే దఫాలో వ్యాక్సిన్లు అందకపోవడంతో రాష్ట్ర వైద్యాధికారులు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. దాంతో మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్‌ ముందుగా హైరిస్క్‌ వర్గాలకు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించారు. ఆటోడ్రైవర్లు, సెలూన్‌ షాపుల్లో పనిచేసేవాళ్ల్లు.. ఇలా 24 క్యాటగిరీల వారిని కరోనా వల్ల హైరిస్క్‌ ఎదుర్కొంటున్న వర్గాలుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా వారు సుమారు 10,04,399 మంది ఉన్నారు. జూన్‌ 5 నాటికి వారిలో 4,14,894 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మిగిలిన వారికి త్వరలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ప్రైవేటు హాస్పిటళ్లలో వ్యాక్సిన్లు ఎక్కువగా లభిస్తున్నాయి అని కువిమర్శలు చేసేవాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలు స్వయంగా కొనుగోలు చేసి అందించిన వ్యాక్సిన్‌ డోసులు 2 లక్షలు మాత్రమే.

జోరుగా మాస్‌ వ్యాక్సినేషన్‌
మాదాపూర్‌: మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో సైబరాబాద్‌ కమిషనరేట్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో మెడికవర్‌ దవాఖానతో కలిసి ఆదివారం ప్రతిష్ఠాత్మక మాస్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు కొనసాగించాలనుకోగా.. పొద్దున్న 6 గంటల వరకే వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11 గంటల వరకు 36 వేల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా సాయంత్రం వరకు 40 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

ప్రభుత్వం గుర్తించిన హైరిస్కు వర్గాలు
(కరోనాకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్న క్యాటగిరీ)

 • రేషన్‌ డీలర్లు, వర్కర్లు
 • ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు
 • పెట్రోల్‌ బంకు వర్కర్లు
 • ఎఫ్‌సీఐ వర్కర్లు
 • జర్నలిస్టులు, మీడియా పర్సన్స్‌
 • ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వర్తకులు, వర్కర్లు
 • ఆర్టీసీ ఉద్యోగులు
 • రైతుబజారు వ్యాపారులు
 • కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు, చికెన్‌ వ్యాపారులు వర్కర్లు
 • లిక్కర్‌ షాపులవారు
 • ఆర్‌ఎంపీలు
 • కిరాణ దుకాణదారులు
 • వీధి వ్యాపారులు
 • ఐరన్‌ అండ్‌ లాండ్రీ వర్కర్లు
 • మెడికల్‌ షాపు వర్కర్లు
 • చిన్న హోటళ్లలోని వర్కర్లు
 • శ్మశానవాటికల్లో పనిచేసేవారు
 • ఆటో డ్రైవర్లు
 • నీళ్లు, పాలు, పేపర్‌ డెలివరీ చేసేవారు

వీరితో పాటుగా వ్యాక్సిన్ల పంపిణీలో కిడ్నీ, డయాలసిస్‌ రోగులు, క్యాన్సర్‌ రోగులు, ఇతర దీర్ఘకాలిక రోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్యాటగిరీ కింద గుర్తించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జనసేవకులకు ధీమా

ట్రెండింగ్‌

Advertisement