Rajinikanth | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తున్నది. కానీ ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతున్నదిఅంటూనే సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు. విజయవాడ వేదిక మీద నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాభివృద్ధిని ఆకాశానికెత్తేశారు. ‘22 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు నైట్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లాను.. నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అర్థం కాలేదు’ అని రజనీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను చూసిన హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు ఎక్కడా పొంతన లేదని చెప్పారు. ‘హైదరాబాద్ ఇండియాలోనే ఎకనామికల్‌గా బాగా ఎదిగిందని అందరికీ తెలుసు..నేను విన్నాను.
తెలంగాణ సీఎం మాన్యశ్రీ కే చంద్రశేఖర్రావుగారు కూడా ఇదే విషయం చెప్పారు’ అంటూ నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా తన మనసులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు రజనీకాంత్. దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి శుక్రవారం విజయవాడ వచ్చిన సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. నిజం ఇలా ఉంటే.. నిత్యం హైదరాబాద్‌ను తానే డెవలప్ చేశానని అడిగినా, అడగకపోయినా అందరి ముందు నిస్సిగ్గుగా చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు పక్కన ఉండగానే రజనీకాంత్ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కీర్తించటం గమనార్హం. ఒక్క రజనీకాంతే కాదు.. ఎందరెందరో దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌ను చూసిన వారంతా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
తాజాగా బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ, ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు ఆదిత్య ఠాక్రే, ఛత్రపతి శివాజీ మునిమనుమడు శంభాజీరాజే, ఒడిశా సీఎం పట్నాయక్, యూకే, ఆస్ట్రేలియా పోలీస్ బృందాలు హైదరాబాద్‌ను చూసి ప్రశంసలు కురిపించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును అవలీలగా దాటేస్తుంది. ఉద్యోగాల రీత్యా విదేశాలకు ఎప్పుడో వెళ్లిపోయిన వారు చాలా కాలం తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి అభివృద్ధిని, ఆకాశహార్మ్యాలను, అధునాతన మాల్స్‌ను చూసి ఆనందపడి, ఆశ్చర్యపోయిన సంఘటనలకు లెక్కేలేదు. ఒక తెలుగు పత్రికాధిపతి కూడా హైదరాబాద్‌ను కేసీఆర్ తీర్చిదిద్దిన విధానాన్ని చూసి ఇంతకన్నా ఎవరు చేయగలరని కితాబివ్వటం తెలిసిందే.