హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): అయిపోయింది.. తెలంగాణ కాంగ్రెస్ పరువు గంగలో కలిసిపోయింది. సొంతంగా కనీసం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు(డీసీసీ)లను కూడా నియమించుకోలేక చేతులు ఎత్తేసింది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేతలు, కీలక నేతలు దద్దమ్మలని భావిస్తున్న ఏఐసీసీ డీసీసీ అధ్యక్ష నియామక బాధ్యతలను స్వయంగా తలకెత్తుకున్నది. రాష్ర్టానికి 22 మంది పరిశీలకులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వీరు ప్రతి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై సూపర్ పవర్స్ కలిగి ఉంటారని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ నిర్ణయంతో టీపీసీసీ పరువు గంగలో కలిసిపోయినట్టేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, కిందిస్థాయి క్యాడర్‌ను ఇది ఆలోచనలో పడేసింది.
గతంలో స్థానిక నేతలతో చర్చించిన అనంతరం డీసీసీ అధ్యక్షులను పీసీసీ నిర్ణయించేది. జిల్లాలోని కీలక నేతల అభిప్రాయాలను, జిల్లాలో పార్లమెంటు స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల సిఫారసులను పరిగణనలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తీవ్రమైన చర్చలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతిమంగా జిల్లా స్థాయిలో ఎక్కువ మంది నేతలు సూచించిన వారికే జిల్లా అధ్యక్ష పీఠం దక్కేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వస్తున్న పరిశీలకులకు స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ నేతలు, పార్టీ కోసం వారు చేసిన త్యాగాలు, కొందరు చేసిన ద్రోహం వారికి ఎలా తెలుస్తాయని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ మాటలు తూచ్
డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయం లో పీసీసీ చీఫ్‌దే తుది నిర్ణయమని, స్థా నిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రా ధాన్యం ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటి వర కు చెప్తూ వచ్చింది. మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లా పర్యటనల్లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవుల కోసం జిల్లాకు మూడు పేర్లతో ప్యానల్ కూడా తయారుచేసినట్టు తెలిపారు. స్థానిక నాయకుల అభిప్రాయం తెలుసుకున్న అనంతరం.. మొగ్గు ఎవరివైపు ఉంటే వారినే డీసీసీ అధ్యక్షుడిగా చెప్తూ వచ్చా రు. అంతేకాదు, ఈ ప్రక్రియ కూడా పూర్తయిందని మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. కానీ, ఏఐసీసీ ప్రకటనతో అదంతా ఉత్తదేనని తేలిపోయిందని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.