Sunkishala Project | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వాసులకు మండు వేసవిలోనూ తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ వద్ద రూ.2215 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం 2024 వేసవి నాటికి పూర్తవుతుందని వెల్లడించారు.
2050 నాటికి పెరిగే తాగునీటి అవసరాలను తీర్చగలిగేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించిన చిత్రాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. వరుసగా ఐదేండ్లు కరవు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా.. దీని ద్వారా తాగునీరు అందించే వీలుంటుంది. ప్రస్తుతం నగరవాసుల అవసరాలను తీర్చేందుకు ఏటా రూ.5-6 కోట్లతో నీటిని తరలించాల్సి వస్తున్నది. సుంకిశాల ప్రాజెక్టు పూర్తయితే ఆ బాధలు తొలగడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని వినియోగించుకోవచ్చు.