హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చట్టవిరుద్ధంగా గెలిచారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీతాగోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. నవీన్‌యాదవ్ అక్రమమార్గంలో గెలుపొందారని ప్రకటించాలని ఆమె సోమవారం దాఖలుచేసిన ఎలక్షన్ పిటిషన్లో కోరారు. ప్రభుత్వ వాహనాల్లో మంత్రులు ఉపఎన్నిక ప్రచారం చేశారని తెలిపారు. నవీన్ యాదవ్ అధికార పార్టీ అభ్యర్థి కావడంతో కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. అధికారులు సైతం పట్టించుకోలేదని ఆరోపించారు. స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పను లు చేపట్టారని, సినీకార్మికులకు భూమి కేటాయిస్తామని బాహాటంగా హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ లేకపోతే ఒక వర్గం ఉనికే ఉండదంటూ విభజనలను రెచ్చగొట్టేలా ప్ర సంగించారని పేర్కొన్నారు. వీటిపై బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులకు పలుమార్లు ఫిర్యా దు చేసినా ఫలితం రాలేదని తెలిపారు.
ఎన్నికల నియమావళి ఉలంఘన సమాచారం సైతం అధికారులు ఇవ్వడం లేదని వివరించారు. నవీన్ యాదవ్ నా మినేషన్ దాఖలు చేసే సమయం లో అనేక వాస్తవాలను కావాలని తొకిపెట్టారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి వివరించలేదని, నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు మొదలైనవి వెల్లడించలేదని తెలిపారు. నవీన్ యాదవ్‌పై ఏడు క్రిమినల్ కేసులు పెం డింగ్‌లో ఉన్నాయని తెలిపారు గానీ, వాటి వివరాలను వెల్లడించకపోవడం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని పేర్కొన్నారు. అయినప్పటికీ నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆమోదించడం చట్టవ్యతిరేకమని తెలిపారు. ఉపఎన్నిక ప్రచారంలో రోజువారీ ఖర్చులను కూడా వెల్లడించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ గుర్తుతో పెయిడ్ న్యూస్‌కు ఇచ్చిన రూ.2.30 లక్షలను ఎన్నికల ఖర్చులో చూపలేదని, కోడ్ ఉల్లంఘించారనడానికి ఇది ప్రధాన ఆధారమని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని చెప్పారు. అక్టోబర్ 26న కొండాపూర్‌లో నిర్వహించిన మున్నూరు కాపు కుల సభలో నవీన్ యాదవ్ ఫొటో, పేర్లు, పార్టీ గుర్తులతో ప్రచారం చేశారని, ఈ సభ ఖర్చును ఎన్నికల వ్యయంలో చూపలేదని ఆరోపించారు.
గెలుపుకోసం నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించారనే ఆరోపణలతో అధికారులే కేసు పెట్టారని సునీతా గోపీనాథ్ గుర్తుచేశారు. ఒక రోడ్ షోలో నవీన్ యాదవ్ ఖడ్గాన్ని ఊపుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. అవినీతి చర్యలు, క్రిమినల్ కేసుల దాచివేత, ఎన్నిక ఖర్చుల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించాలని కోరారు. నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. సు ప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు తమ క్రిమినల్ నేపథ్యాన్ని రెండు పత్రికల్లో, టెలివిజన్ ప్రకటనల రూపంలో వెల్లడించాలనే నిబంధనను నవీన్ ఉల్లంఘించాడని తెలిపారు. క్రిమినల్ కేసులు, ఆస్తులు, ఇతర కీలక సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చారని, కొన్నింటిని గోప్యంగా ఉంచారని, మరికొన్నింటిని తప్పు గా చూపారని ఆరోపించారు. ఆ వివరాలను వెల్లడించి ఉంటే ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే తీరు మరోలా ఉండేదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని మాగంటి సునీత కోరారు.