హైదరాబాద్/జూబ్లీహిల్స్, అక్టోబర్3(నమస్తే తెలంగాణ): బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్‌ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పాలనలో ఘోర వైఫల్యాలు.. హైడ్రా తెచ్చిన చిచ్చు.. అమలుకాని హామీలు.. బస్తీల జాడకే రాని అభివృద్ధిఫలాలు.. గ్రూపు తగాదాలు.. ఫలితంగా కాంగ్రెస్ బేజారు అవుతున్నది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ స్థానం నుంచి గోపీనాథ్ సతీమణి సునీతాగోపీనాథ్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఆమె ఎన్నికల ప్రచారమే కొనసాగిస్తూ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికలోనే ఎటూ తేల్చుకోలేక వెనుకబడింది. 20 నెలల కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్న తరుణంలో రోజురోజుకూ రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తికానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో గెలిచి మూడో ఏడాదిలోకి ఘనంగా అడుగుపెట్టాని కాంగ్రెస్ యోచిస్తున్నది. కానీ అందుకు తగినట్టు అడుగులు పడటమే లేదని సీఎం రేవంత్‌రెడ్డి శిబిరం ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.
ఒకవైపు ప్రభుత్వ, ప్రైవేట్ సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆశావహుల పేర్లు రోజుకొకటి చొప్పున తెరమీదికి వస్తుండటంతో పార్టీ క్యాడర్ అందోళనలో పడింది. పెద్దసంఖ్యలో పెరిగిన ఆశావహుల్లో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనని కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ధైర్యం చేసి అభ్యర్థి పేరు ఖరారు చేస్తే, భంగపడ్డ ఆశావహులంతా వెన్నుపోటు పొడిచేందుకూ సిద్ధంగా ఉన్నారని టీపీసీసీకి హెచ్చరికలు అందినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ జఠిలంగా మారుతున్నట్టు గాంధీభవన్ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగా చూస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలోనే సీఎం శిబిరం ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు కుస్తీ పడుతున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు.
రోజుకో అభ్యర్థి తెరమీదికి వస్తుండటంతో ఎంపిక విషయంలో అయోమయానికి గురవుతున్నారని తెలిసింది. తొలుత బీసీ కోటాలో చిన్న శ్రీశైలంయాదవ్ కుమారుడు నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వాలని, ఆయనకు ఎంఐఎం మద్దతు కూడా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టు తెలిసింది. ఆయన పేరు తెర మీదికి రాగానే..అదే బీసీ కోటా నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ లేచి కూర్చున్నారు. బీసీ కోటాలో తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది.
అంజన్‌కుమార్ యాదవ్ పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో ఇటీవల భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. పీజేఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులంతా తనకు మద్దతుగా ఉన్నారని ఆయనకు వివరించినట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీలో తనకున్న పాత పరిచయాలతో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. బీహార్ నేత తేజస్వీయాదవ్, యూపీకి చెందిన అఖిలేశ్‌యాదవ్ ద్వారా తన ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు అంజన్‌కుమార్ యాదవ్ కొడుకు రాజ్యసభ సభ్యుడైన అనిల్‌కుమార్ యాదవ్ సైతం తన తండ్రి కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు.
అంజన్‌కుమార్, బొంతు రామ్మోహన్ తన ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలోనే ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు తెరమీదికి వచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఆయన పార్టీ ఫిరాయించి సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై అనర్హత వేటు అనివార్యమని తేలడంతో, ఆ వేటు కంటే ముందే ఆయనతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం.
అదే జరిగితే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే షరతు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి జూబ్లీహిల్స్ టికెట్ అడిగినట్టు తెలిసింది. రెడ్డి కోటాలో రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. టీపీసీసీ ఆయా అభ్యర్థుల పేర్ల కసరత్తు చేస్తుండగా, మైనంపల్లి హాన్మంత్రావు, కంజర్ల విజయలక్ష్మి పేర్లు తెరపైకి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
మూడురోజుల క్రితం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్ నగర్ బస్తీలో మంత్రి వివేక్ సమక్షంలోనే స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గీయులు, ఎన్ఎస్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి వర్గీయుల మధ్య వివాదం చెలరేగి పరస్పరం దాడుల వరకు పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న సీఎన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో ఆశావహుడి స్కెచ్‌లో భాగంగానే ఈ గొడవ జరిగిందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్నా.
దసరా నేపథ్యంలో ఇదే డివిజన్లో కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్‌యాదవ్ అభిమానులు స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలను వేయించారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు స్థానిక కార్పొరేటర్ ఫొటో లేకుండా ఫ్లెక్సీలను ఎలా పెడుతారంటూ ఏకంగా ఆ ఫ్లెక్సీని చించివేశారు. ఈ వివాదం పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లినట్టు తెలిసింది. ఎవరికి టికెట్ ఖరారు చేసినా, ఆశావహులైన నవీన్‌కుమార్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి తదితరులు ఒకరికొకరు సహకరించే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతాగోపీనాథ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తుగానే ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నేతగా స్థానం సంపాదించుకున్న గోపీనాథ్ కుటుంబానికే ప్రాధాన్యమిస్తూ, నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికే కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ ఇక్కడ వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యం ఉండటంతోపాటు అన్ని డివిజన్లలో జరిగిన గోపీనాథ్ సంస్మరణ సభలు పార్టీ క్యాడర్లో ఉన్న ఐక్యత, ఆయన మీదున్న అభిమానాన్ని చాటిచెప్పింది.
అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు కేటీఆర్ భుజాలకు ఎత్తుకోవడంతో పార్టీ క్యాడర్‌కు ఫుల్ జోష్ వచ్చింది. కేటీఆర్ ఇచ్చిన బలంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్ నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సాధ్యమైనంత మేరకు నియోజకవర్గంలోని అన్నికాలనీల ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారంలో భాగంగా.. తన భర్త చేసిన సేవలను ఆమె గుర్తుచేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన పనులు, పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆమె ఓటు అడుగుతున్నారు. భర్త మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ఆమెకు అదనపు బలం కానున్నదని, ఏ ఇంటికి వెళ్లినా సునీతా గోపినాథ్‌ను భర్తను కోల్పోయి తొలిసారి గడపతొక్కిన ఆడబిడ్డగానే ఆదరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తోపాటు విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ ఆశావహుల మధ్యన కుమ్ములాటలు బహిర్గతం అవుతుండగా, ఇన్చార్జి మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులుగా నియమితులైన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్రావు మధ్యన అభ్యర్థుల ఎంపిక విషయమై విభేదాలు పొడచూపాయని తెలుస్తున్నది. దీంతో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మంత్రుల వ్యవహారశైలి మారిందని పార్టీ నేతలే చెప్తున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో ఉండకపోవచ్చని, కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక జరిగేలోపు బీఆర్ఎస్ అ భ్యర్థి సునీతాగోపీనాథ్ ఒక దశ ఇంటింటి ప్రచారం పూర్తి చేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు.