హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో గిరిజన మహిళ వీ లక్ష్మిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం నోటీసులు జారీచేసింది. గిరిజన మహిళపై ఈ నెల 15న జరిగిన దాడి గురించి పత్రికల్లో వార్తలు రావడంతో చీఫ్ జస్టిస్‌కు జస్టిస్ సూరేపల్లి నంద లేఖ రాశారు. దీనిని సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. మంగళవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, రాచకొండ డీసీపీ, ఎల్బీనగర్ ఎసీపీ, ఎస్పీలను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.