హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. మే 14, 21, 28, జూన్ 4న పనిచేసే ఈ బెంచ్‌లలో హెబియస్ కార్పస్, ముందస్తు బెయిలు, బెయిలు దరఖాస్తులు, కూల్చివేతలు తదితర అంశాలకు సంబంధించిన అత్యవసర కేసులను జస్టిస్ టీ మాధవీదేవి, జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు విచారిస్తారని తెలిపారు.
యుద్ధ స్మారకాన్ని కూల్చొద్దు ; ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని రోడ్డు విస్తరణలో భాగంగా యుద్ధ స్మారక చిహ్నాన్ని తొలగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జే రామకృష్ణకు హైకోర్టు కీలక సూచన చేసింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించాలని ఆయనకు స్పష్టం చేసింది. రామకృష్ణారావు పిటిషన్‌కు నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఐలాపూర్‌లో కూల్చివేతలపై కోర్టు ధికరణ నోటీసులు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడిదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలంటూ గతంలో పనిచేసిన పురపాలక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు హైడ్రా కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అమీన్పూర్ ఎస్‌హెచ్‌వో తదితరులకు నోటీసులు జారీచేసిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేశారు.