హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : రానున్న వేసవి దృష్ట్యా ఫిబ్రవరి ఒకటి నుంచి 20 రోజుల పాటు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు మండల స్థాయి బృందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి సీతక ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం తాగునీటి సరఫరా దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జలాశయాల నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షించడం, కనీస డ్రా డౌన్ లెవల్స్‌ను పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బల్ నీటి సరఫరాకు ఆటంకాలు కలగకుండా పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి 24 గంటల్లో మరమ్మతులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతామని వివరించారు. బల్ నీటి సరఫరాపై రోజూవారీ పర్యవేక్షణ, ఉదయం 9.30 గంటలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సమస్యలు తలెత్తిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు పేర్కొన్నారు.