మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 02:56:04

ఎండాకాలంలోనూ ఎత్తిపోత

ఎండాకాలంలోనూ ఎత్తిపోత

  • లక్ష్మీబరాజ్‌కు నేటికీ
  • ఏప్రిల్‌ చివరిదాకా  ప్రవాహం
  • ఎస్సారార్‌కు మొదలైన కాళేశ్వరం జలాల ఇన్‌ఫ్లో
  • ఎల్‌ఎండీలో వచ్చే ఆగస్టు అవసరాలదాకా నిల్వ
  • వానకాలానికి ముందే తుపాకులగూడెం సాంకేతికసర్వే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మండువేసవిలోనూ ప్రాణహిత నుంచి ఇన్‌ఫ్లోలు కొనసాగుతుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టే లక్ష్మీబరాజ్‌ ఒడిసిపడుతున్నది. అవసరాలకు అనుగుణంగా అధికారులు దూరదృష్టితో ఎత్తిపోతలు నిర్వహిస్తున్నారు. ఎస్సారార్‌లో నీటి నిల్వలను అలాగే ఉంచుతూ ఎల్‌ఎండీ పరిధిలో వచ్చే ఆగస్టు దాకా అవసరాలకు నిల్వలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు లక్ష్మీబరాజ్‌ గేట్ల ద్వారా దిగువకు పంపేనీటితో వానకాలానికి ముందే సమ్మక్కబరాజ్‌ సాంకేతిక సర్వే నిర్వహణకు యోచిస్తున్నారు. ఎండాకాలం ప్రారంభమై 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన లక్ష్మీబరాజ్‌కు ప్రాణహిత నుంచి ఇన్‌ఫ్లోలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా 1500 క్యూసెక్కుల వరకు రాగా.. నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షంతో 2 వేల క్యూసెక్కులు వస్తున్నదని అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్‌ చివరిదాకా 1500 క్యూసెక్కుల వరకు వరద వస్తుందని  పేర్కొంటున్నారు. ఈ కాస్త వరదను కూడా ఒడిసిపట్టి తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం లక్ష్మీబరాజ్‌లో 3.460 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. బరాజ్‌కు వస్తున్న స్వల్ప వరదను అంతమేరలో ఎత్తిపోసేందుకు లక్ష్మీ పంపుహౌజ్‌లో ఒక మోటరును నడుపుతున్నారు. అక్కడినుంచి ఎల్లంపల్లిదాకా జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. మరోవైపు ఎల్‌ఎండీ ద్వారా కాకతీయకాల్వలో నిరవధికంగా నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. దీంతో లోయర్‌ మానేరులో నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 7.873 టీఎంసీ నీటినిల్వ ఉన్నది. దీంతోపాటు వచ్చే ఆగస్టు వరకు మిషన్‌ భగీరథ అవసరాలకు కూడా డ్యాంలో నీటినిల్వలు ఉంచాల్సిన అవసరం ఉండటంతో ప్రాణహితలో వచ్చే స్వల్పవరదను మళ్లించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

తొలి దఫాలో 11 టీఎంసీలు

రానున్న ఆగస్టు వరకు తాగునీటి అవసరాలతో పాటు యాసంగి అవసరాల కోసం ఎల్‌ఎండీ అధికారులు గతంలోనే 21 టీఎంసీల కాళేశ్వరజలాలు కావాలని కోరారు. మొదటి దఫాలో 11 టీఎంసీల వరకు నీటిని వదిలారు. దీంతో ఇప్పటిదాకా అవసరాలు తీరడంతో పాటు ఎల్‌ఎండీలో 8 టీఎంసీల వరకు నిల్వలు ఉన్నాయి. అయితే ఇకముం దు కాకతీయకాల్వకు నీటిని వదలడంతోపాటు మిషన్‌ భగీరథకు నిల్వలు సిద్ధంగా ఉంచాల్సి ఉన్నందున మిగిలిన 10 టీఎంసీలు కావాలని అధికారులు మరోసారి కోరా రు. దీంతో కాళేశ్వరంలో భాగంగా నంది, గాయత్రీ పంపుహౌజ్‌ల్లో రెండుమోటర్ల చొప్పున నడుపుతూ నీటిని శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ బుధవారం మొదలైంది. రెండుమోటర్ల ద్వారా వస్తున్న 6,300 క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్టుగా ఎల్‌ఎండీకి వదులుతున్నారు. ఇప్పటికీ కాకతీయకాల్వలో ఐదువేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

చివరి ప్రవాహందాకా సద్వినియోగం

ప్రాణహితకు వరద కొనసాగే ఏప్రిల్‌ చివరివరకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ గతంలోనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. అప్పటివరకు దిగువనఉన్న సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్‌లో నీటినిల్వకు గేట్ల బిగింపును పూర్తిచేయాలని ఆదేశించారు. లక్ష్మీబరాజ్‌లో ఎత్తిపోసేందుకు వీలుకాని నీటిని గేట్లద్వారా దిగువకు వదిలి.. సమ్మక్కబరాజ్‌లో నిల్వ చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో ఎగువన లక్ష్మీబరాజ్‌లో సాంకేతికంగా పరిశీలన ప్రక్రియ జరుపుతూనే.. సమ్మక్క బరాజ్‌లో కొంతమేర నీటిని నిల్వచేయడం ద్వారా అక్కడ ఏవైనా చిన్నచిన్న లోపాలు ఉన్నాయా? అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. వానకాలంలో వరదలు వచ్చేవరకు ఆగకుండా మే నెలలోనే సాంకేతిక సర్వే ప్రక్రియ పూర్తిచేయవచ్చు అనేది ప్రభుత్వం యోచిస్తున్నది.

 లింక్‌-2లో ఎత్తిపోతలు ప్రారంభం

ధర్మారం/ రామడుగు/ బోయినపల్లి/ తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్‌-2లో బుధవారం నుంచి నీటి ఎత్తిపోతలను తిరిగి ప్రారంభించారు. ఆరోప్యాకేజీలో నందిపంప్‌హౌజ్‌లో 2,3 నంబర్ల మోటర్లు ఆన్‌చేసి 6,300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్యాకేజీ-8లో భాగంగా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌజ్‌లో 2, 4వ బాహుబలి మోటర్లను అధికారులు ఆన్‌చేశారు. ఎస్సారార్‌ నుంచి 14,15,16 నంబర్ల గేట్లతోపాటు రివర్స్‌ స్లూయిస్‌ ద్వారా ఆరువేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇక్కడకు ఆరువేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎస్సారార్‌లో 24.68 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. ఎల్‌ఎండీకి 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 5300 క్యూసెక్కులు బయటకు పోతున్నది. ఎల్‌ఎండీలో 7.873 టీఎంసీల నిల్వ కొనసాగుతున్నది.


logo
>>>>>>