Anganwadi Centers | హైదరాబాద్ : అంగన్వాడీ చిన్నారులకు శుభవార్త. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేరెంట్స్, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
ఈ వేసవి సెలవుల్లో అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరుకుల సరఫరా చేయనున్నారు. ఇక ఈ సెలవుల కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అప్పగించనున్నారు. ఇంటింటి సర్వే, హోం విజిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను విధిగా నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.