హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12న ఆదివారం రావడంతో జూన్ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 1 నుంచి 9వ తరగతి వరకు శనివారంతో ఆఖరి పనిదినం ముగిసింది. ఆయా విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేసి, పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఎస్సెస్సీ పరీక్షలు మే 23 నుంచి ఉన్నందున పదో తరగతి విద్యార్థులకు క్లాసులు, ప్రీఫైనల్ పరీక్షలు యథాప్రకారం కొనసాగనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో కరోనా రెండో వేవ్ భయపెట్టినా, మూడోవేవ్ తీవ్రత అంత గా లేకపోవడంతో తరగతులు సజావుగానే సాగాయి. మొత్తంగా విద్యా సంవత్సరం ఆటుపోటుల మధ్యే ముగిసింది. జూన్లో కరోనా తీవ్రతను బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంపై తుది నిర్ణయం ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.