హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భానుడు తీవ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండల మండిపోవడంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ఎండలకుతోడు వేడిగాలులు తోడుకావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
నాలుగురోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్‌ను దాటేస్తున్నదని తెలిపింది. దీంతో 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది. వచ్చే ఐదు రోజులపాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదు కాగా, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో 43.4 డిగ్రీలు, జగిత్యాలలో 43.3, కరీంనగర్లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. హైదరాబాద్‌లో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, ఈనెల 19 నుంచి 22 వరకు తెలంగాణ ఉత్తర, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.