బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుకూల విధానాల ఫలితంగా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీసీఆర్బీ) విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్టు-2023 వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని చూడాలనుకున్న కేసీఆర్ కల సాకారమైంది. ఇందుకోసం ఆయన పడ్డ కష్టం, చేసిన కృషి ఫలించింది. ఆయన ఆశయం నెరవేరింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా కనుమరుగయ్యాయి. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల మరణమృదంగం వినిపించేది. రైతు ఆత్మహత్యలేని రోజంటూ ఉండేది కాదు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల గుండెకోతను నిలువరించాలని కేసీఆర్ సంకల్పించారు. ఆ దిశగా రైతు సంక్షేమ, వ్యవసాయ అనుకూల పథకాలను అమలు చేశారు. ఫలితంగా 2015లో రాష్ట్రంలో 1209 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత అన్నదాతల బలవన్మరణాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాతి ఏడాది 2016లో 490కి తగ్గింది. అయితే 2017, 2018లో కాస్త పెరిగి 676, 720 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కాళేశ్వరం జలాలు పొలాలకు చేరి, రైతు పథకాలు గాడిలో పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2020లో 343, 2021లో 303, 2022లో ఇది 178కి తగ్గాయి. ఇక 2023లో ఏకంగా ఇది 48కి పడిపోవడం గమనార్హం. తొమ్మిదేళ్ల కాలంలోనే 1209 నుంచి 48కి అనగా 96శాతం తగ్గుదల నమోదైంది.
రైతుల ఆత్మహత్యల్లో ఎప్పుడూ రెండు, మూడు స్థానాల్లో ఉండే తెలంగాణ 2023లో ఏడో స్థానానికి చేరింది. ఈ స్థానానికి చేరడం అదే తొలిసారి కావడం గమనార్హం. 2023లో దేశంలో అత్యధిక మంది రైతుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో ఏకంగా 2134 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఆ తర్వాత రెండో స్థానంలో 1209 మంది రైతుల ఆత్మహత్యతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న పంజాబ్‌లో 133 మంది, ఆంధ్రప్రదేశ్ 109 మంది ఆత్మహత్యతో నాలుగో స్థానంలో, 74 మందితో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక 48 మంది రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ ఏడోస్థానంలో నిలిచింది. దేశంలో 11 రాష్ర్టాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గడం ఆశామాషీగా జరిగిన పని కాదు. దీనివెనుక నాటి సీఎం కేసీఆర్ చేసిన విశేషమైన కృషి దాగి ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఒక్కో పథకంతో వ్యవసాయరంగానికి జీవం పోశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంటల కొనుగోలు, సబ్సిడీ విత్తనాల పంపిణీతో పాటు తెలంగాణ జల ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీర్చారు. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులకు ప్రాణం పోసి భూగర్భ జలాలు పెరిగేలా చేశారు. ఒక్క రైతుబంధు ద్వారానే రూ.80 ల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కేసీఆర్ అమలుచేసిన ఒక్కో పథకం వ్యవసాయరంగానికి పునర్జీవం ఇవ్వడంతోపాటు రైతులకు ఊపిరిపోసింది. వీటి ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు.. అప్పుల ఊబి నుంచి బయటపడి ఆత్మహత్యలకు దూరంగా ఉన్నారు. ఆ ఫలితమే నేటి ఎన్సీఆర్బీ నివేదికలో ప్రతిబింబించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు సంక్షేమ పథకాలు సరిగా అమలు కాక పోవడంతో మళ్లీ పరిస్థితి తారుమారైంది. రెండేండ్లలోనే 700 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో రెండేండ్ల క్రితం వరకు తెలంగాణలో శాంతిభద్రతలు పరిఢవిల్లాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీసీఆర్బీ) విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్టు-2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదైన క్రైమ్ రేట్ ప్రకారం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ఐపీసీ నేరాలు, ఎస్ఎల్ఎల్ ప్రకారం జరిగిన నేరాల్లో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో మానవ అక్రమ రవాణా కేసులు, వృద్ధులపై, ఎస్సీలపై నేరాలు, అవినీతి కేసులు, విదేశీయులు చేసే నేరా లు, విదేశీయులపై జరిగిన నేరాలు, పర్యావరణ సంబంధిత నేరాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దక్షిణాది రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 8.82 శాతం కిడ్నాప్‌లలో తగ్గుదల కనిపించినట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. ఇక ఐపీసీ, ఎస్ఎల్ఎల్ నేరాల్లో టాప్-10 రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలువగా.. కర్ణాటక 10వ స్థానంలో నిలిచింది. 1,83,644 నేరాలతో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. 2023లో భారత నేర శిక్షా స్మృతి (ఐపీసీ) కింద దేశవ్యాప్తంగా భారీగా నేరాలు నమోదు కాగా, తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.