మంచిర్యాల, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస్తున్నారని, కొన్ని రోజుల క్రితం తల్లికి ఫోన్లో చెప్పిన శ్రీహిందు ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల వేధింపులు, సరైన వైద్యం అందకపోవడంతోనే విద్యార్థిని మృతి చెందిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి తండ్రి రాళ్లబండి రమేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీహిందు రెండేండ్లుగా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నది.
ఏడో తరగతి చదువుతున్న శ్రీహిందు వాంతులు చేసుకుంటున్నదని, చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్తున్నామని బుధవారం రాత్రి 10.30 గంటలకు హాస్టల్ నుంచి రమేశ్‌కు ఫోన్ చేశారు. వెంటనే దవాఖానకు వెళ్లిన రమేశ్‌కు శ్రీహిందు హాస్టల్లో తిన్నది పడక, వాంతులు చేసుకుంటున్నదని చెప్పి పాపను అప్పగించి సిబ్బంది వెళ్లిపోయారు. మూడు రోజులపాటు డాక్టర్లు చికిత్స చేసినా తగ్గకపోవడంతో శనివారం శనివారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ టెస్టులన్నీ చేశాక పురుగులమందు తాగడంతో పాప కిడ్నీలు, లంగ్స్ పూర్తిగా పాడైపోయాయని, జాండిస్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం విద్యార్థిని మృతి చెందింది. శ్రీహిందు మృతికి ఉపాధ్యాయులు, చెన్నూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, జైపూర్ ఏసీసీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు చేరుకొని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ప్రత్యేక అధికారిని నియమించి పాప మృతిపై సమగ్ర విచారణ చేయించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విద్యార్థిని మరణవాంగూల్మం ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

శ్రీహిందు మృతదేహాన్ని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్.. దవాఖానకు వచ్చి పరిశీలించారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల కలెక్టర్, అధికారులు, మంత్రి వివేక్ గురుకులాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యే తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీహిందు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల స్థలం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 127 మంది విద్యార్థులు మృతిచెందారని చెప్పారు.శ్రీహిందుది 128వ మరణమని వెల్లడించారు.