‘నా చావుకు కారణం క్రాప్‌లోన్. చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదని ఆత్మహత్య’ అని సూసైడ్ నోట్ రాసి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదీ ప్రభుత్వ కార్యాలయంలోనే తనువు చాలించాడు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన అసంబద్ధ నిబంధనే ఆ రైతు ఉసురు తీసింది. పదేండ్ల కిందటి కాంగ్రెస్ సర్కారు హయాంలో సాగునీరు లేక పంటలు సాగుకాక ఉపాధి బాటపట్టిన ఆ రైతు.. నేడు అదే కాంగ్రెస్ పాలనలో పంట రుణం మాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు సురేందర్‌రెడ్డి తనువు చాలించాడు.
మేడ్చల్/దుబ్బాక, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ మోసానికి మరో అన్నదాత అసువులు బాసాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ వ్యవసాయ కార్యాలయంలో జరిగిన ఈ విషాద ఘటన శుక్రవారం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) బలవన్మరణంతో మేడ్చల్‌తోపాటు ఆయన సొంత గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట ప్రతాప్‌రెడ్డి, సుశీల దంపతులకు రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి కుమారులు. వీరికి పదెకరాల పొలం ఉండగా, దశాబ్దాల కిందటే వివాహాలైన వీరు వేర్వేరుగా నివాసాలు ఉంటున్నారు. గతంలోనే ఇద్దరు కొడుకుల పేరిట చెరో నాలుగెకరాల పొలం, తల్లి సుశీల పేరిట రెండెకరాలు ఉన్నది. పదేండ్ల కిందట సాగునీటి సమస్యతో రెండు కుటుంబాలు గ్రామం విడిచి వలస వెళ్లారు. పెద్ద కొడుకు రవీందర్‌రెడ్డి బొల్లారంలో, సురేందర్‌రెడ్డి మేడ్చల్‌లో తమ కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. వారి తల్లి సుశీల ఇద్దరు కొడుకుల వద్ద ఉంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో సురేందర్‌రెడ్డి సంతోషపడ్డారు. రుణమాఫీ కోసం నెల రోజులుగా తన స్వగ్రామమైన చిట్టాపూర్‌కు వచ్చి వెళ్తున్నాడు. రుణమాఫీ మూడు విడతల జాబితాల్లో సురేందర్‌రెడ్డి పేరు రాలేదు. అతని అన్న రవీందర్‌రెడ్డికి మాఫీ అయ్యింది. తనకు ఎందుకు కాలేదని ఆరాతీశాడు. ఇందుకు కారణం సురేందర్‌రెడ్డి రేషన్‌కార్డులో తన తల్లి సుశీల ఉండటమేనని అధికారులు చెప్పడంతో విస్తుపోయాడు.
చిట్టాపూర్ ఏపీజీవీబీలో పంట రుణాలు
సుశీల సహా ఇద్దరు కొడుకులకు చిట్టాపూర్ ఏపీజీవీబీలోనే పంట రుణ ఖాతాలు ఉన్నాయి. సుశీలకు రెండెకరాల పాస్‌బుక్‌పై రూ.1,15,662 పంట రుణం ఉండగా, రవీందర్‌రెడ్డికి నాలుగెకరాల పాస్ పుస్తకంపై రూ.1.60 లక్షల రుణం ఉన్నది. సురేందర్‌రెడ్డికి నాలుగెకరాల పాస్ పుస్తకంపై రూ. 1,92,443 రుణం ఉన్నది. వీరిలో రవీందర్రెడ్డికే రుణమాఫీ అయ్యింది. నాలుగురోజుల క్రితం రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి కలిసి ఏపీజీవీబీలో రుణమాఫీ గురించి మేనేజర్‌ను అడిగారు. సురేందర్‌రెడ్డికి ఆయన తల్లికి ఒక్కటే రేషన్‌కార్డు ఉన్నందున రుణమాఫీ కాలేదని బ్యాంకు మేనేజర్ అనిరుధ్ చెప్పారు. రేషన్‌కార్డులో ఉన్న కుటుంబసభ్యులకు 2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుందని చెప్పడంతోపాటు మిగతా డబ్బులు చెల్లించాల్సిందేనని సూచించారు. మానసికంగా కలత చెందిన సురేందర్‌రెడ్డి గురువారమే మేడ్చల్ వెళ్లాడు. రుణమాఫీ జరగలేదని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.
రైతుకు ఉరిపోసిన రేషన్‌కార్డు నిబంధన
రైతు పాస్ పుస్తకం ప్రాతిపదికన రుణమాఫీ జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ రేషన్‌కార్డు ఆధారంగానే మాఫీ అమలైంది. ఇదే సురేందర్‌రెడ్డి ఉసురు తీసింది. సురేందర్‌రెడ్డి ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని గ్రామస్థులు తెలిపారు. పదేండ్ల కిందట కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు సాగునీరు లేక సాగు సాధ్యం కాక ఉపాధి కోసం కుటుంబంతో కలిసి మేడ్చల్‌కు వలస వెళ్లాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పంట రుణమాఫీ జాబితాలో సురేందర్‌రెడ్డి పేరు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి గాంధీ దవాఖానకు వెళ్లి సురేందర్‌రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి రేవంత్‌రెడ్డి సర్కార్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2500 మంది రైతులకే మాఫీ
చిట్టాపూర్ ఏపీజీవీబీలో 3,400 మంది రైతులు రుణాలు తీసుకోగా 2,500 మంది రైతులకు రూ. 20.53 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. మిగతా 900 మందికి మాఫీ కాలేదని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
ఏవో కార్యాలయంలో విగతజీవుడై..
ఇంటి నుంచి గురువారం బయటకు వెళ్లిన సురేందర్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో విగతజీవుడై కనిపించాడు. కార్యాలయ ఆవరణలోని ఇనుప మెట్లకు తాడు కట్టి.. మెడకు బిగించుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. మృతదేహంపై ఉన్న ఎస్బీఐ ఏటీఎం స్లిప్పులను పోలీసులు గుర్తించారు. ఒక స్లిప్‌లో ‘నా చావుకు కారణం క్రాప్‌లోన్. చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదని ఆత్మహత్య’ అని కింద మూడు ఫోన్‌నంబర్లు రాశాడు. మరో స్లిప్‌లో ‘నా చావుకు కారణం నా అమ్మ’ దాని కిందనే మరోసారి చిట్టాపూర్ బ్యాంకులో క్రాప్‌లోన్ మాఫీ కాలేదని ఆత్మహత్య’ అని రాశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. తల్లికి, తనకు ఒకటే రేషన్‌కార్డు ఉన్నందున రుణమాఫీ కానందుకే సురేందర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తున్నదని పోలీసులు చెప్పారు.