తుర్కపల్లి, జనవరి 27 : తెచ్చిన ఆప్పు తీరక.. సాగుచేసిన పంట ఎండిపోయి ఆ రైతు గుండె ఆగిపోయింది. అప్పుబారం ఎక్కువ కావడం.. పంటనష్టం వాటిల్లడంతో ఇంట్లో దూలానికి ఉరేసుకుని తనువు చాలించాడు. నిరుడు జూలైలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పట్టించుకోకపోగా, కనీసం విచారణ కూడా జరపకపోవడం శోచనీయం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొనికెల కిష్టయ్యకు ఇద్దరు కుమారులు. వారిలో రాజయ్య మొదటివాడు. ఆయనకు భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి పేరున ఉన్న 2.20 ఎకరాల భూమిలో తన భాగానికి వచ్చిన ఒక ఎకరం 10 గుంటల భూమిని రాజయ్య సాగు చేసుకోసాగాడు. దానిపక్కనే ఉన్న మరో రైతు 5 ఎకరాల భూమిని రాజయ్య కౌలుకు తీసుకున్నాడు. ఈలోగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
కాళేశ్వరం జలాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బోగస్ అని, కూలిపోతుందని నీటి విడుదలను కాంగ్రెస్ సర్కార్ నిలిపేసింది. వర్షాలు లేక, గోదావరి జలాలు అందక రాజయ్య సాగు చేసిన 6.10 ఎకరకాలకు గానూ 3.20 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయింది. అంతకుముందే బ్యాంకులో లోన్ తీసుకొని ట్రాక్టర్ను కొనుగోలు చేయడంతోపాటు కూతురు వివాహం చేశారు. అన్నీ కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు అప్పు అయింది. సాగుచేసిన పంట ఎండిపోవడం, తెచ్చిన అప్పు కట్టలేక మనస్తాపం చెంది నిరుడు జూలై 9న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో సాగునీళ్లు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను పూర్తిగా మర్చిపోయింది’ అని రైతు రాజయ్య భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు పెట్టుబడి సకాలంలో అందేది. ప్రభుత్వం మారినంక పెట్టుబడి సాయం బందయింది. ఒకవైపు వర్షాలు పడలేదు. మరోపక్క సాగు నీళ్లు రాలేదు. వేసిన పంట ఎండిపోయింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆయన పాణం ఇడిసినంక ఏం చేయాలో తోచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు మమ్మల్ని ఆదుకోలేదు. కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేదు. కుటుంబపోషణ ఎంతో భారమై కూలిపనులకు పోయి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నం.