హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పులు అవసరమని నేషనల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ఉపకులపతి, ఉన్నత, వృత్తి విద్య విభాగాధిపతి, ప్రొఫెసర్ సుధాంశు భూషణ్ అభిప్రాయపడ్డారు. ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ నుంచే ఆ దిశగా అడుగులు పడాలని, దీని కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో జరుగుతున్న అఖిల భారత ఉన్నత విద్యామండలి చైర్మన్ల సదస్సు లో కీలకోపన్యాసం చేశారు.
ఉన్నత విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందుకు సమాఖ్య స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ ఆర్ లిం బాద్రి మాట్లాడుతూ విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న ప్రగతిశీల నిర్ణయాలతో ఉన్నత విద్యలో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అనంతరం ఆయా రాష్ర్టాల ఉన్నత విద్యామండళ్ల చైర్మన్లతోపాటు ప్రతినిధులు తెలంగాణ టీ హబ్‌ను సందర్శించారు.