హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బుధ, గురు, శుక్రవారాల్లో పలుచోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి పలు వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో రూ.12.86 లక్షల ఫైన్‌ను వాహన యజమానులకు విధించినట్టు పేర్కొన్నారు. పటాన్చెరు ఆర్సీపురం యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైన్స్, స్టేట్ ట్యాక్స్, ఆర్టీఏ విభాగాల అధికారులతో కలిసి ముత్తంగి, పటాన్చెరు పరిధిలో ఆకస్మికంగా రూట్ చెక్‌ను నిర్వహించినట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా 16 వాహనాలపై ఓవర్‌లోడ్, ట్రాన్సిట్ఫామ్ లేకుండా రవాణా, రాయల్టీలు, జీఎస్టీ ఎగవేత వంటి వాటిపై కేసులు నమోదు చేసి 6,70,000 జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. అలాగే కోకాపేట ప్రాంతంలో హైదరాబాద్ రూరల్ యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి 15కేసులు నమోదు చేసి రూ.6,16,258 జరిమానా విధించినట్టు ఆమె వెల్లడించారు.