RTA Office | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికారులకే చెల్లింది. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏఏంవీఐలకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో సోమవారం ఆర్టీఏ సేవల కోసం స్లాట్ బుక్ చేసుకున్న 170 మందికి చుక్కెదురైంది. సీఎం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆఫీసుకు సెలవు ప్రకటించినట్టు వా హనదారులకు అధికారులు సందేశాలు పం పారు.
ఆర్టీఏ అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. తమకు సేవలు నిలిపివేసి చేసిన ఘనకార్యం ఏంటో చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి సేవలు కొనసాగించాల్సింది పోయి.. ఉన్న సేవలను రద్దు చేసి తమ సమయం వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రాకతో ఆర్టీఏ కార్యాలయంలో సెలవు వాతావరణం కనిపించింది. కౌంటర్లన్నీ బంద్ చేశారు. ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో వాహన సేవల కోసం వచ్చిన వారు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మంగళవారం సేవలు అందిస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.