హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఓటర్ల జాబితా శుద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతున్నా ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కొంత అస్పష్టత ఉన్నదని, దానిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాల నివారణ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.
అనంతరం రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ‘సర్’ కార్యక్రమంపై వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కొత్తగా ఫొటోలు సమర్పించాలనే నిబంధనపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన లేదని, దీనివల్ల ఓటు హకు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇంటింటి సర్వే సమయంలో ఓటరు అందుబాటులో లేకపోతే పేరు తొలగించే అవకాశం ఉన్నదా? అనే అంశంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, లేదా రెండు వేర్వేరు రాష్ర్టాల్లో ఓటు హకు కలిగి ఉండటం వంటి అంశాలను ఈసీ తీవ్రంగా పరిగణిస్తున్నందున అర్హులైన వారు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఈవోను కోరినట్టు చెప్పారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి, సామాన్యులకు ఇబ్బందులు కలుగకూడదని చెప్పారు.
ఓటర్ల జాబితా రూపకల్పనలో కేవలం ప్రభుత్వ యంత్రాంగం బూత్ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే కాకుండా, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఓటు హకు విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారని గుర్తుచేశారు. ఓటర్ల జాబితా అత్యంత పారదర్శకంగా, జాగ్రత్తగా రూపొందించాలని, అధికారులు ఎకడా పొరపాట్లు జరుగకుండా చూడాలని సీఈవోను కోరినట్టు చెప్పారు. జూన్, జూలైలో ఎస్ఐఆర్ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపినట్టు వివరించారు.