హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే నియమించాలని బీజేపీ ఎండోమెంట్ సెల్ కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ ప్రసాద్ తివారీ డిమాండ్ చేశారు. పదిరోజుల్లోగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే వేలాదిమంది బ్రాహ్మణులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని పాలకవర్గాలను నియమిస్తున్నప్పటికీ బ్రాహ్మణ పరిషత్‌ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
పేద బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గం అవసరమని, గత ఏడు నెలలుగా పాలకవర్గం లేకపోవడంవల్ల సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సంక్షేమ దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, అర్చకులకు నెలనెలా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.