హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దామని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు సూత్రాలతో నగరంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను నిర్మించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తార్నాకలోని సీసీఎంబీలో శనివారం జరిగిన ఇస్బాకాన్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గమని తాను భావించానని చెప్పారు. యువతలోని నైపుణ్యానికి సరైన ఆర్థిక వనరులు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకంతో టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో తీర్చిదిద్దామని అన్నారు.
ఒకేసారి రెండు వేల స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రారంభమైన టీ హబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నదని తెలిపారు. 2014లో నగరంలో 200 స్టార్టప్ కంపెనీలు ఉంటే ప్రస్తుతం ఐదు వేలకు పైగా పనిచేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రతన్‌టాటా లాంటి గొప్ప వ్యక్తి టీ హబ్‌ను సందర్శించి ఆధునిక భారత ముఖచిత్రం అంటూ ప్రశంసించారని తెలిపారు. యువత, మహిళలు, గ్రామీణుల్లోని గొప్ప వ్యాపార ఆలోచనలకు కార్యరూపం దాల్చేవిధంగా టీహబ్, టీ వర్స్, ఇమేజ్ టవర్స్, టాస్క్, వీ హబ్ వంటి వాటిని ఏర్పాటు చేశామని చెప్పారు. మన దేశం స్వదేశీ టెక్నాలజీతో ప్రయోగించిన మొదటి శాటిలైట్ ప్రయోగంలో హైదరాబాద్‌లోని స్టార్టప్ కంపెనీయే కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఉన్న మొత్తం స్టార్టప్ కంపెనీలు ఏటా 3.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధిస్తున్న్నాయని చెప్పారు.