Revanth Reddy | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): సరూర్నగర్లో సంగ్రామ సభ వేడి సీఎంకు గట్టిగానే తాకినట్టుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… బీఆర్ఎస్ సదస్సుకు నిరుద్యోగులు వెల్లువలా తరలిరావడం సీఎం జీర్ణించుకోలేక పోయినట్టున్నారు. శనివారం జరిగిన అందెశ్రీ సృతివనం కార్యక్రమంలో ఆయనలోని అసహనమంతా అరాచక వ్యాఖ్యలుగా బయటకు వచ్చింది. ‘గజ్వేల్లోనే మిమ్మల్ని సమాధి చేసేందుకు మా యువకులు సిద్ధంగా ఉన్నారు’ అంటూ రేవంత్ మళ్లీ చావుభాష వాడారు. ప్రజలనుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సీఎం తీరు మారడం లేదు.
వేదిక ఏదైనా, సందర్భం ఏమైనా దిగజారుడు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారు. ‘నీళ్లు కాదు రక్తం చల్లితే పంటలు పండుతయ్’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రేవంత్ రక్తపిపాస భాషను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రక్తదాన కార్యక్రమాలతో ఎండగట్టగా.. సాగునీళ్లివ్వలేక, రక్తం చల్లుడు గురించి సీఎం మాట్లాడిన మాటలను రైతులు కూడా ఈసడించారు. తాజాగా ముఖ్యమంత్రి రోతభాషకు అందెశ్రీ సంస్మరణ కార్యక్రమం వేదికైంది. తాను ఎక్కడ ఉన్నాను? తన ముందు ఎవరున్నారు? అనే విషయం మరిచి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. అందెశ్రీని యాది చేసుకుందామని సభకు వచ్చిన సాహితీవేత్తలు, తెలంగాణవాదులు.. రేవంత్ దిగజారుడు మాటలతో నివ్వెరపోయారు.