హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు (Anganwadi centers) , ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలకు గుడ్ల (Eggs) సరఫరా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక రేటుకు టెండర్లు దక్కించుకొని తక్కువ బరువుతో కూడిన గుడ్లను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇది గుత్తేదారులకు కాసులపంట పండిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.6.10-రూ.6.40 వరకు ధర
రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, అంగన్వాడీసెంటర్లు, కేజీబీవీలకు ప్రతిరోజూ సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు కోడిగుడ్లను సరఫరా చేయాల్సి ఉన్నది. వాస్తవానికి మార్కెట్ రేట్‌పై 20 పైసలకు అదనంగా కోడిగుడ్లను అందజేయాల్సి ఉంటుంది. గతంలో రూ.5.20 నుంచి రూ.5.30 వరకు గుడ్లను అందించేవారు. ఒక్కో గుడ్డు 50 నుంచి 60 గ్రాములు ఉండాలని నిర్దేశించేవారు. అయితే, ఇటీవల 28 జిల్లాల్లో టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. గతానికి భిన్నంగా ఒక్కో గుడ్డు ధరను రూ.6.10 నుంచి రూ.6.40 వరకు నిర్ణయించారు. ధర ఎక్కువైనా నాణ్యమైన, అధిక బరువు కలిగిన గుడ్లను సరఫరా చేస్తున్నారా? అంటే అదీలేదు. కేవలం 30 నుంచి 40 గ్రాముల గుడ్లే అందజేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తున్నది.
స్టాంపింగ్ లేకుండానే సరఫరా
నిబంధనల ప్రకారం స్టాంపింగ్ కలిగి తాజా కోడిగుడ్లనే సరఫరా చేయాల్సి ఉంటుంది. నెలలో మొదటి 10 రోజులు నీలిరంగు, ఆ తర్వాత పది రోజులు ఎరుపు, చివరి పదిరోజులు ఆకుపచ్చ స్టాంపింగ్‌తో కూడిన గుడ్లను అందజేయాలి. కానీ,గుత్తేదారులు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్టాంపింగ్ లేకుండానే అంటే ఎక్కువకాలం నిలువ ఉంచిన గుడ్లను సరఫరా చేస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు సైతం సహకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల నిర్వాహకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టర్ల కక్కుర్తి.. సర్కారు సొమ్ము లూటీ
అంగన్వాడీలు, హాస్టళ్లు, గురుకులాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు కక్కుర్తిపడి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.6.10కి కాంట్రాక్ట్ దక్కించుకొని కేవలం రూ.4 విలువైన కోడిగుడ్లను సరఫరా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నాయి. ఒక్కో గుడ్డుకు సుమారు రూ.2 చొప్పున మొత్తంగా ప్రతిరోజూ సరఫరా చేసే 13 లక్షల గుడ్లకు రూ.26 లక్షలు కొల్లగొడుతున్నారని పేర్కొంటున్నారు. కొందరు ఉన్నతాధికారులు, అధికార పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమదందాకు అడ్డుకట్ట వేసి ప్రజాధనాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.