Operation Musi | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోయి, డబుల్ బెడ్రూం ఇండ్లలోకి మారిన వారికి ఆర్థిక చేయూతనివ్వడంలో భాగంగా 172 మంది లబ్ధిదారులకు రూ.3.44 కోట్ల చెక్కులను మంత్రి సీతక్క శుక్రవారం ప్రజాభవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కో మహిళకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఇందులో రూ.1.4 లక్షలు సబ్సిడీగా ఉంటాయని, మిగిలిన రూ.60 వేలను మూడు ఏండ్లలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. డబుల్ బెడ్రూంలు పొందిన బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశం కల్పించామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పాత్ర చాలా కీలకమని అన్నారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యరాజ్, మూసీ జేడీఏం గౌతమి, మూసీ ఈడీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, డీఈవో రోహిణి తదితరులు పాల్గొన్నారు.
ఈ పథకం అందరికీ వర్తిస్తుందా?
స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణాలు అందజేస్తామని, మహిళా పారిశ్రామికవేత్తల కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలతోపాటు ప్రత్యేక నిధి ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా పావలా వడ్డీ రుణాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయలేదని స్వయం సహాయక బృందాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. తమకు రుణాలు ఎప్పుడిస్తారు? అంటూ కొందరు స్వయం సహాయక సంఘాల మహిళలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ బాధితులకు రూ.2 లక్షల చొప్పున సబ్సిడీ రుణాలు అందజేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఈ పథకాన్ని మూసీ బాధిత మహిళలకు మాత్రమే వర్తింపజేస్తారా? రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు.