హనుమకొండ చౌరస్తా, నవంబర్ 26 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామికి అంగరంగవైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ నాట్య మండపంలో గణపతి ఆరాధన, మండపారాధన నిర్వర్తించి ఉత్సవమూర్తులను ప్రతిష్టించి మంత్రఉపచారములతో స్వస్తిపుణ్యవాచనం, నవగ్రహా ఆరాదన, రుత్వికరణ, దీపారాధన అనంతరం ధరూరి శ్రీమన్నారాయణచార్యులు యాగ్నికంలో కళ్యాణ క్రతువును నిర్వహించారు.
బాసికధారణ, యజ్ఞోపవిత్రం జిలకరబెల్లం మహాసంకల్ప మంత్రపఠనంతో పాదపక్షాళణ ‘మాంగళ్య తంతునానే’ అంటూ మాంగళ్యగౌరీపూజ నిర్వహించి మంగళసూత్రధారణ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఇద్దరు సతీమణులు దేవసేనశ్రీవల్లి అమ్మవార్లకు సుబ్రమణ్యేశ్వరస్వామికి ముట్టించి రెండు జతల పుస్తెలు ధరింపజేయడం జరిగిందని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
మహిళా భక్తురాలు లెక్చరర్ కృష్ణవేణి ‘స్వామివారి కళ్యాణం చూతమురారండి కళ్యాణతలంబ్రాలు పోయదంరండి’ అంటూ ఆమె స్వామి వారి కీర్తనలు ఆలపిస్తుండగా వందలాది మంది భక్తుల సమక్షంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నామస్మరణంతో మారుమోగుతుండగా తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ నిర్వర్తించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు ప్రసాద వితరణ, తలంబ్రాలు అందజేశారు. విశాఖపట్నంకు చెందిన బ్యాంక్ అధికారి రాఘవేందర్ దంపతుల సౌజన్యంతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.