నాంపల్లి కోర్టులు, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్‌ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాంపల్లి కోర్టుకు సమర్పించారు. వాటిలో పలు వస్తువులు, పెన్‌డ్రైవ్‌లు, సీడీలు, కీలక పత్రాలు ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆ సాక్ష్యాధారాలను స్వీకరిస్తూ ఇన్చార్జి మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న సోమవారం డిఫాల్ట్ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. తాజాగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి ప్రణీత్‌రావు తరఫున కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ముగ్గురి పిటిషన్లపై వాదనలను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ అధికారి ఎదుట హాజరయ్యేందుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనుండటంతో తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వీరిద్దరినీ అరెస్టు చేసేందుకు ఇప్పటికే రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు మంగళవారం ఢిల్లీలో క్యాట్ విచారణకు హాజరయ్యారు. ఐఏఎస్‌లు ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్, ప్రశాంతి, వాకాటి కరుణ, వాణీప్రసాద్ తమ వాదనలు వినిపించారు. వారు తెలంగాణలో కొనసాగుతుండటంపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. క్యాట్ వీరి నుంచి వివరణ తీసుకున్నది.