హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ‘నీట్’ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాలలో అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. నెలరోజుల పాటు నీట్ దరఖాస్తులకు అనుమతించి, మళ్లీ వారం రోజులకు గడువు పొడిగించడం, జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా, జూన్ 4నే రిజల్ట్స్ ప్రకటించడం వంటి చర్యలతో అనుమానాలు మరింత పెరిగాయని మంత్రి విమర్శించారు. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం, గ్రేస్ మార్కులను కలపడం అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టు అయిందని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం స్పందించాలని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పై మళ్లీ నమ్మకం కలిపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు.
సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. ఒకవైపు సింగరేణిని ప్రైవేట్ పరం చేసేదిలేదని అంటూనే.. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పనిలో కేంద్రం ఉన్నదని ఆరోపించారు. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్రం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని యోచించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి మాట్లాడతారని తెలిపారు. శాంతి భద్రతల పట్ల తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, జోవో 46 పై త్వరలో సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ నియామక పక్రియకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు
.