కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదని సబ్బండవర్ణాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించలేదని విద్యార్థులు.. ఉద్యోగ విరమణ బకాయిలు ఇవ్వలేదని పెన్షనర్లు.. ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు, షాదీముబారక్ పథకాలు ఇంకెప్పుడు అమలుచేస్తారని మహిళలు, రోడ్లకు మరమ్మతులు చేయాలని పలుగ్రామాల ప్రజలు సర్కారును నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇప్పించండి మహాప్రభో అని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. కేసీఆర్ సర్కారులో సక్రమంగా అమలైన పథకాలు ఇప్పుడు ఎందుకు ఇవ్వరని నిగ్గదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఎస్జీపీఏటీ రాష్ట్ర కార్యదర్శి మేరీ ఏసుపాదం ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యతక్షన పెన్షనర్ల సంఘాల నేతలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. 18 నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసినా ఏ ఒకరికి బకాయిలు చెల్లించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గుత్తేదారులకు, ఇతర అవసరాలకు కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇచ్చేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్వో పద్మశ్రీకి వినతిపత్రం అందజేశారు.

ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు, షాదీముబారక్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తరని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్ మహిళలు అధికారులను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఇప్పించండి మహాప్రభో అంటూ సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ సయ్యద్ హైదర్‌తో కలిసి నిరసన వ్యక్తంచేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, ఎన్ని సార్లు అధికారులకు దరఖాస్తులు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్‌కు వినతిపత్రం అందజేశారు.