హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : విద్యారంగం అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ కృషి చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన సంఘం 78వ వార్షిక కౌన్సిల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో నైతిక విలువల పెంపునకు కృషి చేస్తూ రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని సూచించారు. సంస్థ సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందగౌడ్, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కమలాపూర్, డిసెంబర్ 8 : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్లో సాంకేతికలోపం తలెత్తడంతో వందేభారత్, రాజధానితోపాటు పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ఆదివారం అంతరాయం కలిగింది. దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే కాజీపేట-బలార్షా ప్రధాన రైలుమార్గం కావడం.. ఉదయం 9.30 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తడంతో సిగ్నల్స్ పడిపోయాయి. 14వ రైల్వేగేట్ ఇంటర్ లాక్ కావడంతో గేటు తెరుచుకోలేదు. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ పడిపోవడంతో 15 నంబర్ రైల్వేగేట్ సమీపంలో సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు కాషన్ ఆర్డర్ ఇచ్చి స్టేషన్ దాటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ కూడా 30 నిమిషాలపాటు నిలిచిపోయింది.