హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అనుభవాలను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బుధ, గురువారాల్లో ముంబైలో పర్యటించారు. మహారాష్ట్ర అధికారులతో సమావేశమై అక్కడ అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేశారు.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెందిన రూ.20,109 కోట్ల రుణాలను మాఫీ చేయడంతో అది ఎలా సాధ్యమైందనే అంశంపై వివరాలు సేకరించారు. ముంబై పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన ఆ ఇద్దరు అధికారులు తుది నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందించనున్నట్టు సమాచారం. మరోవైపు, రుణమాఫీకి కటాఫ్ తేదీని నిర్ణయించే అంశంపై కూడా ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7వ తేదీతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రకటన, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9వ తేదీని కూడా కటాఫ్ తేదీగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.