సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురిలోశిక్షణ కేంద్రం సందర్శన
ధర్మపురి, మే 29: నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి సర్కారు కొలువులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతుల శిబి రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడి కోచింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆందోళనను వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.