హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): పది వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సర్కార్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన విద్యార్థుల ఇంజినీరింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను పూర్తిగా సర్కారే చెల్లించింది. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో 7 ద్వారా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రూపురేఖలే పూర్తిగా మారనున్నాయి. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతిన విద్యార్థుల ఖాతాల్లోనే నగదు జమ చేయాలని నిర్ణయించడంతో ఇక నుంచి ర్యాంకర్లకు, ఇతర పేద వర్గాల విద్యార్థులకు ఫీజుల భారం తప్పదని తేలిపోయింది. ఇక టాపర్లు, 10 వేల లోపు ర్యాంకర్లు సైతం ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. ఇదే నిబంధనపై కాలేజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కోర్టు కచ్చితంగా ఈ క్లాజ్‌ను ఎత్తివేస్తుందన్న ప్రచారం జరుగుతున్నది.
సర్కార్ కూడా అదే కోరుకుంటున్నదని తెలుస్తున్నది. హైకోర్టు తీర్పును సాకుగా చూపి విద్యార్థుల నుంచి కాలేజీలు నేరుగా ఫీజు వసూలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నదని, మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు సర్కార్ ప్రణాళికాబద్ధంగా ఇలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నదని విద్యార్థి, ఇతర కులసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా జీవో 7 ద్వారా పేదవర్గాల విద్యార్థులను ఉన్నత చదువులను దూరం చేసే కుట్రలకు సర్కార్ దిగింది. దీనిద్వారా పేదల చదువులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే పన్నాగం పన్నింది. రాష్ట్రంలో ఏటా 13 లక్షలమంది విద్యార్థులు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఈ పథకంపై సర్కార్ తాజా చర్యలను విద్యార్థి, వివిధ బీసీ కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
ఇక నుంచి డీబీటీ పద్ధతిన విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయనుండటంతో అనే క దుష్పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. విద్యార్థి సీట్ అలాట్మెంట్ సమయంలోనే ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. విద్యార్థి డబ్బులు కడితేనే ఆ సీటు దక్కుతుంది. లేదంటే ఆ సీటు క్యాన్సిల్ కానున్నది. ప్రైవేట్ అయినా, ప్రభుత్వ కాలేజీ అయినా ముందే ఫీజులు చెల్లించాల్సి ఉంటుం ది. ఇక రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థి ఖాతా లో వేస్తే దుర్వినియోగం అవుతుందన్న వాదనలూ వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు అడ్మిషన్ సమయంలోనే చెల్లించడం, విద్యార్థులు ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకుంటే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను సర్కార్ ఇబ్బడిముబ్బడిగా పెంచింది. పలు కోర్సుల ఫీజులను 15 శాతానికి పైగా పెంచగా, కొన్నింటిలో అయితే 30% ఫీజులు పెరిగాయి. ఉదాహరణకు శ్రీనిధి కాలేజీల్లో ఎంబీఏ ఫీజు గతంలో రూ.లక్ష ఉండగా, ఈసారి రూ.1.12 లక్షలకు పెంచారు. సీబీఐటీ కాలేజీలో రూ.1.10 లక్షలుంటే.. ఇప్పుడు రూ.1,23.200కు పెంచారు. భవన్స్ వివేకానంద కాలేజీలో గతంలో రూ.1.10 లక్షలుంటే ఇప్పుడు రూ.1,23.200కు పెంచారు. విశ్వవిశ్వానీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రూ.90 వేలు ఉండగా, రూ.1,00,800కు పెంచారు.
రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 వేలే చెల్లిస్తూ వస్తున్నది. 10 వేలకు మించి ర్యాంక్ ఉన్న, ప్రైవేట్ కాలేజీల్లో చదివిన ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తున్నది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ (టీఏఎఫ్ఆర్సీ) బీటెక్ మినిమమ్ ఫీజును రూ.45 వేలకు పెంచింది. రాష్ట్రంలో ఏ కాలేజీలోనూ రూ.35 వేల ఫీజు లేదు. సర్కార్ ఇచ్చే ఆ రూ.35 వేలు పోను మిగతా ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి వస్తున్నది. సీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫీజు రూ.1.60 లక్షలుగా ఉన్నది. ఈ కాలేజీలోని 10 వేలకు పైగా ర్యాంకు గల బీసీ విద్యార్థి చేరితే అతనికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కార్ రూ.35వేలే చెల్లిస్తున్నది. మిగతా రూ.1.25 లక్షల ఫీజును విద్యార్థులు సొంతంగా చెల్లించాల్సిందే.
సర్కార్ తెచ్చిన జీవో-7ను కచ్చితంగా సవరించాలి. ఈ జీవోతో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఇది విద్యార్థులపై పెనుభారం పడనున్నది. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. దీనిద్వారా కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. విద్యార్థులు ఫీజుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది.
-వేముల రామకృష్ణ, తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-7ను రద్దుచేయాలి. ఈ పథకం ద్వారా లబ్ధిపొందే పేద విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదు.
– వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి, ఈబీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షుడు