హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): టాంకాం సంస్థ ద్వారా శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకొని, ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు అవసరమైన సహకారం అందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం టాంకాం ఏర్పాటు చేసింది. రాష్ర్టానికి చెందిన విద్యార్థులకు జర్మన్ భాష నేర్పించి, జర్మనీలో నర్సింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ సంకల్పించింది. ఉన్నత విద్యావంతులైన అనేక మంది విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. రెండో బ్యాచ్‌కు కూడా దరఖాస్తులు స్వీకరించి, ఎంపికైనవారికి ఆఫర్ లెటర్లు ఇచ్చారు. శిక్షణకు ఎంపికైన ఒక్కో విద్యార్థి రూ.3.75 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మొదటి విడతగా రూ.లక్ష మే 9 కల్లా చెల్లించాలని టాంకాం సూచించడంతో ఆ మేరకు ఫీజులు కూడా చెల్లించారు. ఆ సమయంలోనే జూన్ 4 నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యార్థులకు టాంకాం అధికారులు చెప్పారు. క్లాసులు ఎప్పటినుంచి ప్రారంభిస్తారనే అంశంపై స్పష్టమైన సమాచారం రావడంలేదు. క్లాసులపై అడుగుతున్న విద్యార్థులతో టాంకాం ప్రతినిధులు, అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు సరియైన సమాచారం ఇవ్వకపోగా, ‘మీ ఫీజు మీరు తీసుకెళ్లండి’ అంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తొలుత జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉన్నదని చెప్పారని, వాస్తవానికి విద్యా సంవత్సరానికి కోడ్ వర్తించదని విద్యార్థులు పేర్కొన్నారు. జూన్ 15న తరగతులు ప్రారంభం అవుతాయని చెప్తున్నారని, అది కూడా అనుమానంగానే ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చి, ఫీజు కట్టించుకునే సమయంలో ఇతర ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని అధికారులు చెప్పారని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో తాము ఇతర ఎంట్రన్స్‌లు రాయలేదని, ఇప్పుడేమో ‘మీ ఫీజు మీరు తీసుకెళ్లండి’ అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాగైతే తమ భవిష్యత్తు ఏమి కావాలని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తరగతులు ప్రారంభించే తేదీలను స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రిక్రూట్మెంట్ మేనేజర్ సౌదామినిని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించగా, రెండో బ్యాచ్‌కి ఎనిమిది నెలల శిక్షణగా మార్పు చేశామని, దీంతో గచ్చిబౌలిలోని నిథమ్ హాస్టల్ వసతికి అనుమతి లభించడానికి సమయం పట్టిందని వివరించారు. తమ సంస్థ సీఈవో అందుబాటులో లేకపోవడంతో శిక్షణ ఆలస్యం అవుతున్నదని తెలిపారు. సీఈవో రాగానే శిక్షణ తేదీలపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.