మహబూబాబాద్ రూరల్, జనవరి 3 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ 2022లో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరైందని తెలిపారు. అప్పటి నుంచి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగేైండ్లెనా అద్దె భవనంలోనే కళాశాల కొనసాగుతున్నదని అన్నారు. ప్రస్తుతం కళాశాలలో 260 మంది విద్యార్థినులు ఉన్నారని, పెరిగిన సంఖ్యకనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు.
కొంతమంది తరగతి గదుల్లో క్లాస్ వింటుంటే, మరికొందరు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఎండకాలం, వానకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని చెప్పారు. కళాశాలలో సరైన ల్యాబ్లు సైతం లేవని, హాస్టల్ సౌకర్యంలేక బయట ఉండాలంటే భారంగా మారుతుందని తెలిపారు. తాగునీరు, టాయ్లెట్స్ సమస్య ఉన్నదని, బిల్డింగ్ కింది గదుల్లో వైద్య శాఖకు సంబంధించిన వ్యాక్సిన్ పెట్టారని పలుమార్లు డీఎంహెచ్వో రవిరాథోడ్కు చెప్పినా వాటిని తొలగించడంలేదని పేర్కొన్నారు. వెంటనే ల్యాబ్ సౌకర్యం కల్పించాలని, నూతన భవనాన్ని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.