హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విద్యావేత్తలు, గురుకుల సొసైటీ ఉద్యోగులు చెప్తున్నారు. గురుకుల సమయ పాలనను మార్చి విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం లేకుండా చేయడం, ఇష్టారీతిన దూరప్రాంతాల్లో అడ్మిషన్లు ఇవ్వడమే ఆత్మహత్యలకు కారణమని వివరిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయడం, విచారణ కమిటీ వేయడం, అక్కడి వార్డెన్‌ను, లేదంటే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప అసలు కారణాలను వెలికితీయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఈ ఏడాది ఆరంభం నుంచే గురుకుల, సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గడచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు గురుకుల విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనుషా మహాలక్ష్మి, మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ గురుకులంలో చదవడం ఇష్టంలేక హరికృష్ణ, పాలమాకుల కేజీబీవీ విద్యార్థిని నవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో గురుకులంలో ఉండటం ఇష్టం లేక భవనం పైనుంచి దూకి విద్యార్థిని సంధ్య ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సుర్పం శేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. జూన్ 30న హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లకపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్య చేసుకున్నది. ఇలా ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటివరకు దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. వారందరూ గురుకులాల్లో ఉండటం ఇష్టం లేక, మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త పనివేళల ఫలితంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థి సంఘాలతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురుకుల పనివేళల మార్పుపై గురుకుల విద్యార్థులు, టీచర్లు అనాడే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మున్ముందు అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం క్లాస్‌లు ప్రారంభమైన తరువాత గంటన్నరకు షార్ట్ బ్రేక్, మూడున్నర గంటల గ్యాప్‌లో లంచ్ బ్రేక్, ఆ తర్వాత గంటన్నర గ్యాప్‌లో తిరిగి షార్ ్టబ్రేక్ ఉంటాయి. కానీ, గురుకుల విద్యార్థులను రోబోల్లా ట్రీట్ చేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతున్నది. మొత్తం 16 గంటల షెడ్యూల్లో కనీసం 2.30 గంటలపాటైనా పర్సనల్ టైమ్ లేదని, అందులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇది విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని గురుకుల ఉపాధ్యాయులు చెప్తున్నారు.
వరుసగా తరగతి గదిలో తల కూడా తిప్పుకునే అవకాశం లేకుండా ఏకంగా మూడు గంటలపాటు కూర్చుని పాఠాలు వినాల్సి వస్తున్నదని, విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోతున్నారని, ఒత్తిడిని అనుభవిస్తున్నారని, కొందరు తరగతి గదుల్లోనే నిద్రపోతున్నారని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఒకే వయస్సు, శారీరక ప్రమాణాలు, మానసిక పరిపక్వత కలిగినవారేనని, గురుకులాల్లో ఉన్నంతమాత్రాన వారిపై ఒత్తిడి పెంచే విధంగా టైంటేబుల్ ఇస్తే వారి మానసికస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని వివరిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల బలవన్మరణాలకు ఇది కూడా ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల ఎంపిక ప్ర క్రియను గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహించారు. జిల్లాలవారీగా మెరిట్‌తో కాకుం డా, రాష్ట్ర మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థులకు వరంగల్‌లో, వరంగల్ విద్యార్థులకు నల్లగొండలో, మహబూబ్‌నగర్ విద్యార్థులకు హైదరాబాద్‌లో.. ఇలా సుదూర ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు.
ఇంటర్ ప్రవేశాల్లోనూ ఎస్సీ గురుకులం ఇదే రీతిన అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించింది. కాలేజీల్లో గ్రూపులన్నీ మార్చడం, కొన్ని కాలేజీలను కేవలం సైన్స్ గ్రూపులకు, మరికొన్ని కాలేజీలను కేవలం ఆర్ట్స్ గ్రూపులకు పరిమితం చేశారు. ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా కాలేజీల్లో గ్రూపులు మార్పు చేశారని సొసైటీ ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. దీంతో విద్యార్థులకు తమ సొంత జిల్లాలో కాకుండా ఎక్కడెక్కడో సీట్లు కేటాయించారు. అడ్మిషన్ పొందిన వారు కూడా తమ సొంత జిల్లాలకే బదిలీ పెట్టుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో వరుస సంఘటనలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. విద్యార్థులపై మానిసిక ఒత్తిడిని పెంచుతున్న పనివేళలను మర్చాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు పట్టుబడుతున్నా సర్కార్ స్పందించడం లేదు.
విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినప్పుడు ఆయా గురుకులాల ఉన్నతాధికారులు హడావుడి చేయ డం, ఎంక్వయిరీ కమిటీ వేయడం పరిపాటిగా మారింది. విద్యార్థి సంఘాలను, తల్లిదండ్రులను శాంతపరిచేందుకో, ఒత్తిడికో తలొగ్గి తాత్కాలికంగా అక్కడి గురుకుల వార్డెన్‌ను లేదంటే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం రివాజుగా మారింది. ఆయా సంఘటనలపై వేసిన కమిటీలు ఏమని రిపోర్ట్ ఇచ్చాయో, అవి ఎక్కడున్నాయో తెలియకుండాపోయింది. మీడియా ప్రతినిధులు అడిగినా అధికారులు ఆ సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఇకనైనా ప్రభుత్వం గురుకులాలపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
గురుకుల సిబ్బంది పర్యవేక్షణ లోపం కూడా వరుస ఆత్మహత్యలకు కారణమని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. అయితే, మారిన పనివేళలతో తాము సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పనిఒత్తిడి కారణంగానే విద్యార్థుల పర్యవేక్షణపై ఎక్కువ దృష్టి సారించడంలేదని గురుకుల ఉపాధ్యాయులు చెప్తున్నారు. గురుకుల ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడమే కాకుండా డైనింగ్, వాటర్ డ్యూటీ, శానిటరీ డ్యూటీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్, కూరగాయలను కొలతలతో ఇవ్వడం, రికార్డులు రాయడం ఇత్యాది అనేక బోధనేతర విధులు కూడా ఉంటాయని వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వృత్తికి, తాము చేసే పనికి సంబంధమే లేదనే నైరాశ్యం ఏర్పడుతున్నదని, తాము సైతం మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురుకుల విద్యార్థులకు ప్రేమను, ఆప్యాయతను ఎలా పంచగలరని ప్రశ్నిస్తున్నారు. గురుకుల డ్యూటీల ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలే కాదు, ఉపాధ్యాయులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులందరూ ఒకే వయస్సు, శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నా ఒకే విధమైన మానసిక పరిపక్వత కలిగి ఉండరు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అదీగాక గురుకులాల్లో ఉండే విద్యార్థులకు, ఇంటి వద్ద ఉండే విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది. గురుకులాల్లో ఉండే విద్యార్థులు తొలుత ఇంటికి, తల్లిదండ్రులకు దూరమవుతున్నామనే భావనతో ఉంటారు.
దానిని మరిపించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురుకులాల్లో నెలకొల్పాలి. బీజీ షెడ్యూల్‌ను ఇస్తే అది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఆత్మహత్యలకు దారితీస్తుంది. విద్యార్థులు సున్నిత మనస్కులు. ఒత్తిడిని తట్టుకోలేరు. విరామం లేని టైంటేబుల్, విద్య సంబంధిత అంశాల్లో వెనుకబాటు, పోటీ కూడా గురుకుల విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సారించాలి.
– డాక్టర్ వీరేంద్ర, సీనియర్ సైకాలజిస్ట్