కోస్గి, అక్టోబర్ 27 : రోడ్డు లేకపోవడంతో పాఠశాలకు వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy)విన్నవించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముంగిమళ్ల నుంచి ముశ్రీఫాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమా రు 60 మంది విద్యార్థులు నిత్యం వెళ్లి వస్తుంటారు. దగ్గరి దారిలో రోడ్డు మంజూరైనా పనులు చేపట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన రాలేదు. చేసేదేమిలేక విద్యార్థులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయించారు. సీఎం సొంత ఇలాకాలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? అని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు బాగు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల సమస్యలను 15రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే నవంబర్ 20న చేనేత కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ హెచ్చరించారు. సోమవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ఏడాదిన్నర నుంచి ప్రకటనలు చేస్తుందని.. ఆచరణలో అమలుకావడం లేదని విమర్శించారు.
చేనేత సహకార సంఘాలకు పన్నెండు ఏండ్ల నుంచి ఎన్నికలు జరుపలేదని, తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నవంబర్ 20న నాంపల్లి చేనేత కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సలహాదారు బడుగు శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షులు వనం ఉపేందర్, వరాల చంద్రశేఖర్, శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.