Telangana | బాసర, డిసెంబర్ 12 : గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో అప్పట్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి వెళ్లేందుకు అప్పట్లో ఓ రైతు సాయపడ్డాడు. ఇప్పుడు తనకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని ఆ రైతు రేవంత్‌రెడ్డిని వేడుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఓ ఘటనపై ఆందోళన చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశం లేక పోవడంతో భవనం వెనుక భాగం నుంచి రేవంత్ లోపలికి ప్రవేశించారు. అయితే ట్రిపుల్ ఐటీ వెనుక భాగానికి చేరుకునేందుకు బాసర మండలంలోని లాబ్ధి గ్రామానికి చెందిన రైతు సిందే ఫీరాజీ తన ట్రాక్టర్లో రేవంత్‌రెడ్డిని తీసుకెళ్లారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రైతు రుణమాఫీ ప్రకటించారు. ఫీరాజీ తల్లి సిందె జీజాబాయి పేరిట ఉన్న రుణం మాఫీ కాలేదు. ఆమె పేరిట రూ.2.25 లక్షలు ఉన్నది. బ్యాంకు అధికారుల సూచన మేరకు రూ.25 వేలు కట్టాడు. అయినా తమకు రుణమాఫీ కాలేదని ఫీరాజీ పేర్కొన్నారు. ‘అప్పుడు మీకు సహాయం చేశా, ఇప్పుడు మా రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలి’ అంటూ ఫీరాజీ వీడియో ద్వారా రేవంత్‌రెడ్డిని కోరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.