నల్లగొండ జిల్లా : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైస్ చాన్స్‌లర్‌ను తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో(Mahatma Gandhi University) విద్యార్థులు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. వీసీ కార్యాలయం ఎదుట డప్పుల చప్పుడుతో పెద్ద ఎత్తున మూడు గంటల పాటు ఆందోళన(Students protest) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్సిటీలోని సమస్యలపై అనేక మార్లు విన్నవించుకున్నప్పటికి పట్టించుకోలేదన్నారు. వివిధ జిల్లాల నుంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులని చదువుకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే వీసీని తొలగించాలని డిమాండట్ చేశారు. భేషరతుగా విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించాలన్నారు. అలాగే మూడో సెమిస్టర్ పరీక్షలు నెలరోజుల పాటు వాయిదా వేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్సిటీ సిబ్బంది వీసీతో చర్చలు జరిపిన అనంతరం విద్యార్థులందరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.