Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్ మొత్తం ఖాకీల అడ్డాగా మారిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం ఓయూను పోలీసు క్యాంపుగా మార్చి వేసినట్లుగా ప్రస్తుతం సైతం క్యాంపస్ పోలీసు క్యాంపుగా మారిపోయిందని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. పరిపాలన భవనం గేటు వద్ద సైతం ఒక వైపు పదుల సంఖ్యలో పోలీసులు, మరోవైపు పదుల సంఖ్యలో ఓయూ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించడం విశేషం.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం లా కళాశాల ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఓయూ వీసీ, ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు అడ్డుకోగా విద్యార్థులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. అక్కడ ఉన్న విద్యార్థి నాయకులను అందర్నీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని అంబర్‌పేట, నల్లకుంట పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని ఆరోపించారు. వర్సిటీలో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే పని ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఉస్మానియా ఉద్యమ స్ఫూర్తి ముఖ్యమంత్రి కి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కక్షపూరిత రాజకీయ పాలన మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓయూ విద్యార్థులను వాడుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులతో బస్సు యాత్ర చేయించింది అప్పుడే మర్చిపోయారా అని దుయ్యబట్టారు. తమ హక్కుల కోసం పోరాడే విద్యార్థులను అణగదొక్కేందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాజ్యాంగ హక్కులను అణిచివేసేందుకు నియంతృత్వ మార్గాలను ఎంచుకున్న ఓయూ వైస్ ఛాన్సలర్ చర్యలను తీవ్రంగా ఖండించారు. వైస్ ఛాన్సలర్ ఎం.కుమార్ తీరు నియంతృత్వ పోకడలతో ఉన్నదని మండిపడ్డారు. యూనివర్సిటీలలో ప్రజాస్వామ్య చర్చలు, పరిశోధనలు సహజమైన అంశమని గుర్తు చేశారు.
దేశంలో, రాష్ట్రంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో అన్యాయం జరిగితే ఓయూ విద్యార్థులు స్పందిస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలు అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఓయూ వేదికగా ఉన్నదని గుర్తు చేశారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి, రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలుకు ఉద్యమాలు నిర్వహిస్తారనే కనీస అవగాహన లేకుండా సర్క్యులర్ జారీ చేయడం అధికారుల అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఓయూ అభివృద్ధికి, ఓయుకు నిధులు కోసం ఓయూ విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు ఉద్యమించడం సాధారణమేనని చెప్పారు. కానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మాత్రం విద్యార్థుల సంక్షేమం గాలికొదిలి, యూనివర్సిటీ అస్తిత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులపై చెత్త నిర్ణయాలు రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వర్సిటీలో అకడమిక్ వాతావరణ కాపాడటం అంటే విద్యార్థులకు అవసరమైన టీచర్ పోస్టుల భర్తీ గురించి మాట్లాడటమని అభిప్రాయపడ్డారు. కానీ అధికారులకు విద్యాసదుపాయాలు, వసతులు మెరుగు పరచడం అనే కనీస అవగాహన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదు నెలల వీసీ పాలనలో ఆయన విద్యార్థులతో, విద్యార్థి సంఘాల నాయకులతో ఒక్క సమస్య మీద కూడా చర్చించలేదని గుర్తు చేశారు. దివ్యాంగ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే, వారిని అమానుషంగా అరెస్టు చేయించి, కేసులు నమోదు చేశారని వాపోయారు. ఓయూ వైస్ ఛాన్స్లర్ అంటే విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు అందుబాటులో ఉండాలి అనే సోయి మరిచి, తానొక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓయూ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించి, విశ్వ విద్యాలయాల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటే దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం
వైస్ ఛాన్స్లర్ల ద్వారా ఇటువంటి అణిచివేత చర్యలకు దిగుతుందా అనే సందేహాలు విద్యార్థులలో కలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ విధానమైతే ఓయూ విద్యార్థులు ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని హెచ్చరించారు.