హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే. యూడైస్‌లో పేరు లేకపోతే పరీక్షలు రాసేందుకు అనుమతించరు. అసలు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకే వీలుండదు. ఇంటర్లో యూడైస్ నమోదును అధికారులు తప్పనిసరిచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇప్పటి వరకు 75% విద్యార్థుల పేర్లు మాత్రమే యూడైస్‌లో నమోదయ్యాయి. మరో 25% నమోదు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రిన్సిపాళ్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
మిగతా విద్యార్థుల పేర్లను యూడైస్‌లో నమోదు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్యలో పదో తరగతిని ఇప్పటికే యూడైస్‌తో అనుసంధానించారు. కొత్తగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌లోనూ యూడైస్ ఎంట్రీ ప్రారంభించారు. ఆధార్‌లో తప్పులుండటం, వాటిని సవరించాల్సి ఉండటంతో మిగతా వాళ్ల నమోదులో సమస్య తలెత్తుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అపార్ నమోదు అంత ఆశాజనకంగా లేదు. మొత్తం విద్యార్థుల్లో ఇప్పటి వరకు 64% మాత్రమే అపార్‌లో నమోదుచేస్తున్నారు. మరో 36% విద్యార్థులు మాత్రమే పెన్ నంబర్ పొందారు. ఆధార్ ఆధారంగా యూడైస్‌లో నమోదుచేస్తారు. ఈ యూడైస్ ఆధారంగా అపార్ ఎంట్రీ ఉంటుంది. పెన్ నంబర్ కేటాయిస్తున్నారు. ఇటీవలీ కేంద్ర విద్యాశాఖ అపార్ నమోదును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది.