బడంగ్పేట్, నవంబర్21: పేద విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంగా మారింది. అసలు విద్యార్థులు ఉండలేని దుస్థితి నెలకొన్నది. చుట్టూ ముసిరిన సమస్యలతో ఆ చిన్నారులు సహవాసం చే యాల్సి వస్తున్నది. ఒకటా, రెండా.. అన్నింటా అవస్థలే. అసలు అది బడి కాదు.. బర్ల కొట్టానికి కంటే అధ్వానంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎస్సీ గురుకుల హాస్టల్‌ను బాలాపూర్ మండలంలోని నాదర్గుల్లోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ హాస్టల్లో ఎక్కడ చూసినా సమస్యలే తిష్ఠ వేశాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సంగతి దేవుడెరుగా కాని కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. హాస్టల్ భవనానికి కిటీకీలు లేవు. డోర్లు లేవు. చలికి వణికి పోతున్నారు. లైట్లు సరిగా వెలగవు.
గతంలో ఇలాంటి సమస్యలతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా మార్పు రాకపోవడం గమనార్హం. హాస్టల్ భవనం చుట్టూ మురుగునీటి కుంటలే ఉంటాయి. దుర్గంధంతో ముక్కుమూసుకోవాల్సిందే. వాటిల్లో ఈగలు, దోమలు ముసురుతాయి. అక్కడి మరుగు దొడ్ల నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. మలమూత్ర విసర్జనకు బయట డబ్బులు పెట్టి వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. స్నానాలు చేసేందుకు బాత్రూములు సరిగా లేవు.
కనీసం తాగునీటి వసతి కూడా ఈ హాస్టల్లో లేదంటే నమ్మి తీరాల్సిందే. కనీసం భోజనమైనా సరిగా పెడుతున్నారా? అంటే అదీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కుళ్లిన కూరగాయలతో నాసిరకం వంటలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆయా సమస్యలతో ఇప్పటికే ఎందరో విద్యార్థులు అంటువ్యాధులు ప్రబలి అనారోగ్యంతో మగ్గుతున్నారు. అయినా ఏ ఒక్క అధికారి కూడా అక్కడి సమస్యలు తీర్చేందుకు ముందుకు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

చెత్తా చెదారంతో అధ్వానంగా మారిన హాస్టల్

హాస్టల్ సమీపంలో మురుగు నీటికుంట