CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది. నారాయణపేట జిల్లాలో 185 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 99 మంది స్కూల్ అసిస్టెంట్ల చొప్పున మొత్తం 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి మండలంలో 4 స్కూల్ అసిస్టెంట్, మద్దూరు మండలంలో 22 ఎస్జీటీ, 14 స్కూల్ అసిస్టెంట్ చొప్పున మొత్తం 36, గుండుమల్ మండలంలో 4 ఎస్జీటీ, 1 స్కూల్ అసిస్టెంట్ చొప్పున మొత్తంగా 5, కొత్తపల్లి మండలంలో ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నా ఈ రెండు జిల్లాల్లో విద్యార్థులకు బోధించేందుకు టీచర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
సర్కారు బడుల్లో టీచర్లను నియామకానికి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సెప్టెంబర్‌లోపు నియామకాలు పూర్తి చేయాలని గడువుగా విధించుకున్నా ఈ రిక్రూట్మెంట్లో తీవ్ర ఆలస్యం కానున్నది. కొత్త టీచర్లు ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. డీఎస్సీ పరీక్షలు ముగిసినా ఇప్పటి వరకు ప్రాథమిక కీ విడుదల కాలేదు. పైగా డీఎస్సీ ఫలితాలపై ఎస్సీ వర్గీకరణ ప్రభావం పడనున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే జారి చేసిన నియామకాల్లోనూ వర్తింపజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. వర్గీకరణ అమలుపై విధివిధానాలు ఖరారుకాని నేపథ్యంలో అప్పటివరకు డీఎస్సీ ఫలితాల వెల్లడి సాధ్యపడే సూచనలు కనిపించడంలేదు.
ఇటీవలి బదిలీలు, పదోన్నతులతో పెద్ద ఎత్తున టీచర్లకు స్థానచలనం కలిగింది. ఈ నేపథ్యంలో టీచర్ల కొరతను అధిగమిందుకు విద్యాశాఖ టీచర్ల సర్దుబాటును చేపట్టింది. కొన్ని జిల్లాల్లో మిగులు టీచర్లు ఉండగా, ఎన్రోల్మెంట్ లేని బడుల్లోని టీచర్లను విద్యార్థులున్న బడుల్లో సర్దుబాటు చేశారు. ఇంకా టీచర్ల సమస్య ఉంటే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు జూలై 30న వివరాలు పంపించాలని అన్ని జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ అధికారులు లేఖను పంపించారు. మూడు నెలల కాలానికి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనుండగా, వీరికి రూ. 15,600 పారితోషికంగా చెల్లించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం ఉన్న వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో 317 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల తర్వాత నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో అత్యధికంగా టీచర్ల కొరత సమస్య తలెత్తింది. టీచర్లు లేకపోవడంతో ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 100 పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటు టీచర్లు లేక, అటు విద్యార్థుల చదువులు సాగే పరిస్థితి లేకపోవడంతో ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతి కోరారు. దీంతో మూడు నెలలపాటు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చినట్టు తెలిసింది. డీఎస్సీ నియామకాలు పూర్తయ్యే వరకు మాత్రమే వీరిని కొనసాగించే అవకాశముందని అధికారులు తెలిపారు.