పరిగి, ఆగస్టు 7 : అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు సముదాయించి గురుకులం లోపలికి పంపించగా వరండాలో కూర్చొని ఆందోళన కొనసాగించారు. తమకు ఫ్యాకల్టీని నియమిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థినులు భీష్మించారు.
మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు అధ్యాపకులు లేకపోవడంతో డిజిటల్ క్లాసులు విని చదువుకోవాలంటూ ప్రిన్సిపాల్ సర్ది చెప్పడం విద్యార్థినుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీ నియామకంపై హామీ ఇవ్వాలని, లేదంటే జాతీయ రహదారిపై ఆందోళన చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. విద్యార్థినుల ఆందోళన విషయాన్ని ప్రిన్సిపాల్ ఉమాసుజాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో గిరిజన విద్యాలయాల ప్రాంతీయ కో-ఆర్డినేటర్ నాగరాజు, ఓఎస్డీ శ్రీనివాస్‌రెడ్డి కళాశాలను సందర్శించి విద్యార్థినులను సముదాయించారు. తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకం చేపట్టి విద్యాబోధన జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.